దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

మళ్లీ దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో  కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 5 మరణాలు కూడా నమోదు కాగా ఇందులో నాలుగు కేరళలోనే సంభవించాయి. మరోకరు ఉత్తరప్రదేశ్ లో మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య  1, 701కి చేరుకుంది.  

 దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816) దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది.  మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించారు.

మరోవైపు కేరళలో కరోనా కొత్త రకం వేరియంట్ జేఎన్.1 కేసును వైద్యాధికారులు గుర్తించారు. శనివారమే ఈ కేసును గుర్తించగా.. ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు చనిపోయాడు. అయితే, జేఎన్.1 వేరియంట్​విషయంలో ఆందోళన అక్కర్లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్  చెప్పారు. 

భారత్ తో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసుులు మళ్లీ పెరుగుతుండటంతో  డబ్ల్యూహెచ్ఓ  ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది.    ఇప్పటికే సింగపూర్‌లో మాస్కులు తప్పనిసరి చేశారు.