
దశబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య సుదీర్ఘ వివాదాస్పద అంశం పీఓకే. ఇది ఇప్పుడు ప్రపంచ టెర్రరిస్టులకు పెద్ద యూనివర్సిటీ. దీని కేంద్రంగానే నిత్యం భారత్ అంతర్గత బాహ్య భద్రతకు విఘాతం కలిగిస్తూ అనేకమంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. 1947లో భారత విభజన సమయంలో బ్రిటిష్ వారు పోతూపోతూ సంస్థానాలు భారత్, పాకిస్తాన్లో ఏదోదానిలో విలీనం లేదా స్వతంత్రంగా ఉండడమా అనే నిర్ణయాన్ని సంస్థానాలకే విడిచి వెళ్ళిపోయారు.
జమ్ము కాశ్మీర్ మహారాజా హరిసింగ్ మాత్రం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ, జమ్మూ ప్రావిన్స్‌లోని రావల్పిండి సరిహద్దు పూంచ్‌లో అధికంగా ఉన్న ముస్లిం తెగలు మహారాజా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా వారి ధాటికి తట్టుకోలేక భారతదేశంలో చేరాలని నిర్ణయించుకొని తన రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ నియంత్రణ మొత్తం భారత ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒక విలీన అంగీకార పత్రం ఇచ్చారు. దాంతో కాశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగమైంది.
దీనిని సహించని పాకిస్తాన్ అక్రమంగా తన సైన్యాన్ని ప్రేరేపించి కాశ్మీర్లో కొంత భూ భాగాన్నీ అక్రమంగా ఆక్రమించుకుంది. అదే ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ దీంతో 1947లో ఇరుదేశాల మధ్య యుద్ధం నెలకొంది . పాకిస్తాన్ దురాక్రమణని భారత్ ప్రపంచ దేశాల ముందుంచింది. ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించి శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరగా 1949 కరాచీ ఒప్పందంతో ముగిసింది.
కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్తాన్ మళ్ళీ ఒప్పందాన్ని ఉల్లంఘించి 1956 గుజరాత్‌లోని రానా ఆఫ్ కచ్‌పై జోక్యం 1965లో మరొకసారి జమ్మూ కాశ్మీర్ సైనిక స్థావరాలను లక్ష్యంగా ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌ను ప్రారంభించింది. దీన్ని భారత్ సైన్యం దీటుగా ఎదుర్కొంది.
బంగ్లా విముక్తి
1971లో పాకిస్తాన్ బంగ్లా జాతీయలపై దాడులు చేస్తుంటే భారత్ బంగ్లా ప్రజలకు మద్దతుగా నిలబడినందుకు పాక్ భారత్‌పై దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. పాక్ భారత్‌పై మరింత ద్వేషాన్ని పెంచుకుంటూ 1990లో జమ్ము కాశ్మీర్లో కార్గిల్ జిల్లాలో వాస్తవాదీన రేఖ (ఎల్ఓసి) దాటి మన సైన్యంపై దాడి చేశారు. ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇలా పక్కలో బల్లెంగా మారి ప్రత్యక్షంగా సైన్యం ఏమీ చేయలేక దొంగచాటున ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారికి నిధులు, ఆయుధాలు, ఆశ్రయాన్ని కల్పించి భారత్‌పై నిత్యం దాడులకు ప్రోత్సహిస్తోంది.
పాక్ ఒక ఉగ్రవాద దేశం
ప్రపంచంలో ఏ దేశంలో ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా సైనిక సంస్థలు , ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ), ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకే అమెరికా, లండన్, యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ ను ‘స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం’ దేశంగా ప్రకటించాయి.
పాకిస్తాన్ ప్రపంచ దేశాలు తమను దోషిగా చూస్తున్నాయని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలను వివాదాస్పద ప్రాంతమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కేంద్రంగా చేసుకొని పాక్ సైన్యం ఉగ్రవాదులతో భారతదేశం సరిహద్దులలో కవ్వింపు చర్యలు పాల్పడుతూ భారతదేశంపై అనేక దాడులకు పాల్పడింది.
టెర్రరిస్టుల శిక్షణ కేంద్రంగా పీఓకే
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలలో పచ్చని అడవులు, లోయలు, నీలి సరస్సులు, సాంస్కృతిక వారసత్వం శారదా పీఠం ప్రశాంతమైన ప్రకృతి అందాలతో ఉన్న ప్రాంతం. కానీ, నేడు కరడుగట్టిన మతోన్మాదంతో మారణహోమం సృష్టిస్తూ, మానవత్వం మరచి అమాయక ప్రజలను, భారత భద్రతాదళాలను పైశాచికంగా చంపుతున్నారు.
పీఓకే కేంద్రంగా కరడుగట్టిన ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలైన లష్కర్ -ఏ -తోయిబా, జైష్- ఏ -మహమ్మద్, హకానీ నెట్వర్క్, త హ్రీక్ - ఇ - తాలిబన్ పాకిస్తాన్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉగ్రవాద సంస్థల వ్యవస్థాపకులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ఇక్కడి నుంచే ఎన్నో దాడులకు కుట్రపన్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యం
ఇటీవల 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ బైసరన్ లోని పహల్గాంలో లష్కర్- ఏ -తోయిబా ఉపసంఘం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ 26మంది పర్యాటకులను మహిళలు, పిల్లలను విడదీసి పురుషులను గుర్తించి మతం అడిగి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలులక్ష్యంగా మిస్సైల్ దాడులతో ‘ఆపరేషన్ సిందూర్’ భారత్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పైచేయి సాధించినా కాల్పుల విరమణ తో ఆగిపోయింది. అందుకే ఈ సిందూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను, ఉగ్రవాద అగ్ర నాయకత్వాన్ని తుదముట్టడించడమే కాదు. తీవ్రవాదులకు అడ్డాగా మారిన పీఓకే స్వాధీనమే పరిష్కారమని భారత ప్రజలు నమ్ముతున్నారు.
ఎంతకాలం?
భారత పార్లమెంట్ 1994లో పీఓకేను భారతదేశంలో భాగంగా ప్రకటించింది. దీని ద్వారా భారతదేశం అంతర్జాతీయ న్యాయానికి అనుగుణంగా వ్యవహరించవచ్చు. పాకిస్తాన్ ప్రజలపై అనేక రకాల దుర్మార్గాలు జరుగుతున్నాయని నివేదికలు ఉన్నాయి. భారత్ పీఓకేను చట్టబద్ధంగా సాధించుకునే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. పీఓకే స్వాధీనం సాధ్యమా, కాదా? అనే చర్చ ఉంది. కానీ, పీఓకే అలాగే ఉంటే, పాక్ ప్రేరిత తీవ్రవాదాన్ని భారత్ ఎంత కాలం భరించాలి? అనే మౌలిక ప్రశ్న ఈ దేశాన్ని వెంటాడుతూనే ఉంటుంది! ఫలితంగానే భారత ప్రజలు పీఓకే స్వాధీనమే పరిష్కారమని బలంగా నమ్ముతూ వస్తున్నారు!
- డా. రావుల కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ–