IND vs ENG 5th Test: రోహిత్ శర్మకు గాయం.. టీమిండియా కెప్టెన్‌గా ‌బుమ్రా

IND vs ENG 5th Test: రోహిత్ శర్మకు గాయం..  టీమిండియా కెప్టెన్‌గా ‌బుమ్రా

ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరుగుతున్న టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. మూడో రోజు ఆటలో భాగంగా హిట్ మ్యాన్ మైదానంలో కనిపించలేదు. అతనికి వెన్ను నొప్పి ఉన్నట్లు బీసీసీఐ నిర్ధారించింది. దీంతో టీమిండియా కెప్టెన్ గా వైస్ కెప్టెన్ బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్, ఫీల్డింగ్ లో మార్పులు చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

ఫిట్ నెస్ సమస్యల కారణంగా టెస్టుల్లో రోహిత్ శర్మ ఆటకు దూరమవవడం ఇదే తొలిసారి. సహచర ప్లేయర్లకు గాయాలైనప్పటికీ రోహిత్ ఎప్పుడూ కూడా ఫిట్ నెస్ కారణంగా తప్పుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ (103) తన టెస్ట్ కెరీర్ లో 12వ సెంచరీ పూర్తికి చేసుకున్నాడు. ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండటం వలన రోహిత్ కు వెన్ను సమస్య వచ్చినట్టు తెలుస్తుంది. రానున్న మూడు నెలల్లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఉండటంతో రోహిత్ గాయం టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో బ్యాటర్ గా విఫలమైన హిట్ మ్యాన్.. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదేశాడు. ఇక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 478 పరుగులకు ఆలౌటైంది. గిల్ (110) , రోహిత్ శర్మ (103) సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.