- ఉ. 10.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
నగోయా: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సెమీఫైనల్స్ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఇరుజట్లు ఈజీగానే ఫైనల్‌కు చేరాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లోనైనా అసలు సిసలు క్రికెట్ చూపెట్టాలని రెండు జట్లూ భావిస్తున్నాయి.
పాక్‌తో పోరులో గెలవడం ఇండియాకు ఎప్పటికీ ప్రతిష్టాత్మకమే. కాబట్టి తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సాహిబ్జాద్ ఫర్హాన్ నేతృత్వంలోని పాక్ ద్వితీయ శ్రేణి జట్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రాలాంటి స్టార్ పేసర్‌ను ఎదుర్కోవడం పాక్ జట్టుకు కఠినంగా మారనుంది.
తేమ, ఎండ కారణంగా బౌన్స్‌లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అక్షర్, సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్‌ను కట్టడి చేయాలంటే పాక్ చాలా శ్రమించాలి. అబ్రార్ అహ్మద్, సుఫియాన్ మోకిమ్ వంటి రిస్ట్ స్పిన్నర్లు ఉన్నా ఇండియా బ్యాటర్లను అడ్డుకునే స్థాయి వాళ్లకు లేదు. మరోవైపు ఏసీసీ ప్రెసిడెంట్ మోషిన్ నక్వీ ఈ మ్యాచ్‌కు హాజరుకావడం లేదు.
