సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్ - పాక్ జవాన్లు

సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్ - పాక్ జవాన్లు

కాశ్మీర్: కొత్త సంవత్సరం వేళ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో సరికొత్త దృశ్యం ఆవిష్కారమైంది.  సైనికులు నిరంతరం రెప్ప మూయకుండా  ప్రాణాలు పణంగా పెట్టి పహారాకాసే ఉద్రిక్త ప్రదేశంలో స్నేహం.. సౌభ్రాతృత్వాన్ని చాటే సన్నివేశం చోటు చేసుకుంది.  ఇరుదేశాల సైనికాధికారులు పరస్పరం స్నేహహస్తం అందించుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి నాలుగు చోట్ల ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. 
మెంధార్ హాట్ స్ప్రింగ్స్ క్రాసింగ్ పాయింట్, పూంచ్ రావ్‌కోట్ క్రాసింగ్ పాయింట్, చకోటి యూఆర్ఐ క్రాసింగ్ పాయింట్ తోపాటు చిల్లానా తిత్వాల్ క్రాసింగ్ పాయింట్ అనే నాలుగు ప్రదేశాలలో ఈరోజు నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత మరియు పాకిస్తానీ ఆర్మీ అధికారులు స్వీట్లు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కవ్వింపులు, రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించే ఇరు దేశాల సైనికుల పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మిఠాయిలు పంచుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లతో స్పందిస్తూ షేర్ చేస్తున్నారు.