హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు ఏ ప్రాంతంలో గుర్తింపు ఇస్తే.. అక్కడే స్టూడెంట్లకు క్లాసులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల్లో పనిచేసే సిబ్బంది, లెక్చరర్లకు తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల నిర్వహణపై ఈ మేరకు గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఇంటర్‌లో స్టూడెంట్ల ఆత్మహత్యల నివారణకు ఇటీవల బోర్డు వేసిన కమిటీ పలు సూచనలు చేసింది. అందుకు అనుగుణంగా బోర్డు సెక్రెటరీ నవీన్ మిట్టల్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. పీజీలో 50 శాతానికి పైగా మార్కులొచ్చిన వారినే లెక్చరర్లుగా నియమించుకోవాలని, రూల్స్ ప్రకారం అవసరమైనంత మందిని పెట్టాలని ఆదేశించారు. విద్యాసంవత్సరం పూర్తయ్యే దాకా వారినే కొనసాగించాలని, ఏప్రిల్ నెలాఖరు వరకు ఎవ్వరినీ తొలగించకూడదని స్పష్టం చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే.. ముందుగా నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూచించారు. వెంటనే ఆ స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీలో ప్రిన్సిపాల్‌కు ప్రత్యేకంగా మొబైల్ నంబర్ ఉండాలని, మేనేజ్‌మెంట్లు ప్రిన్సిపాల్‌ను మారిస్తే తప్సనిసరిగా డీఐఈఓకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. కాలేజీ మేనేజ్‌మెంట్ హాస్టళ్లలో విద్యార్థులుంటే వారికి కనీసం 8 గంటల నిద్ర ఉండేలా షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. ఉదయం గంటన్నర టిఫిన్, రెడీ కావడానికి ఇవ్వాలని, లంచ్/ డిన్నర్ కోసం 45 నిమిషాల చొప్పున టైమ్ కేటాయించాలన్నారు. రోజూ సాయంత్రం ఒక గంట వినోదం కోసం అలాట్ చేయాలని ఆదేశించారు.
ఇంకొన్ని గైడ్ లైన్స్
- ప్రతి కాలేజీలో తప్పనిసరిగా సీనియర్ ఫ్యాకల్టీని స్టూడెంట్ కౌన్సెలర్‌గా నియమించాలి.
- కాలేజీ పని వేళల్లో బయటి వ్యక్తులను అనుమతించొద్దు. పేరెంట్స్‌కు నిర్ణీత సమయాల్లో పర్మిషన్ ఇవ్వాలి.
- అడిషనల్ క్లాసులు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ మించొద్దు.
- ఫీజు కట్టిన ఏ స్టూడెంట్ అయినా, ఏ కారణంతోనైనా మధ్యలో కాలేజీ మానేస్తే.. 3 కేటగిరీల ఆధారంగా 7 రోజుల్లో రిటర్న్ ఇవ్వాలి.
- మొదటి మూడు నెలల్లో మానేస్తే 75%, ఆరు నెలలకు 50%, ఆ తర్వాత అయితే 25 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి.
- కాలేజీల్లో ప్రతిరోజూ స్పోర్ట్స్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించాలి.
- ప్రతి కాలేజీలో ఏటా రెండుసార్లు మెడికల్ చెకప్‌లు చేయించాలి.
- లెక్చరర్లు టీచింగ్ డైరీలు మెయింటైన్ చేయాలి. స్టూడెంట్లకు 75 శాతం అటెండెన్స్ ఉండాలి.
- కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.