
- నిందితులంతా క్యాటరింగ్ బాయ్స్
- వివరాలు వెల్లడించిన పాలమూరు ఎస్పీ జానకి
నవాబుపేట, వెలుగు: ఈజీ మనీ కోసం పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు పాలమూరు ఎస్పీ డి.జానకి తెలిపారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. క్యాటరింగ్ పని చేసుకుంటూ బతుకుతున్న మహ్మదాబాద్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అశోక్, నల్గొండ జిల్లా నుంతకల్ మండలం ముకుందాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి సాయికుమార్, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన సర్ధస్ అఖిల్, వరంగల్ జిల్లా జనగాం మండలం పాకాల గ్రామానికి చెందిన బుర్కాసాయి క్యాటరింగ్ చేసే సందర్భంలో కలిశారు.
ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పశువులు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యాదగిరిగుట్ట, యాలాల్, సైబరాబాద్, వికారాబాద్, నవాబుపేట, కుల్కచర్ల తదితర ప్రాంతాల్లో 16 పశువులను దొంగిలించి అమ్ముకున్నారు. వాటి విలువ రూ.14.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 2న పశువులు దొంగిలించారని మరికల్ గ్రామానికి చెందిన బాధితుడు అంబటి రాములు ఫిర్యాదు చేశాడు.
నవాబుపేట పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, కన్మన్ కాల్వ గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని గుర్తించారు. దాని నంబర్ ఫేక్ అని తేలడంతో, నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో 9 పశువులు,6 దూడలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీ సాయంతో నవాబుపేట ఎస్సై విక్రం, ఏఎస్సై జనార్ధన్, హెడ్ కానిస్టేబుళ్లువెంకట్రాములు, సురేశ్‌బాబు, కానిస్టేబుళ్లు భాస్కర్, శెట్టినాయక్ను ఎస్పీ అభినందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీ నాయక్‌పాల్గొన్నారు.