గుండెపోటు రాలేదు గానీ.. స్టంట్ వేశారు

గుండెపోటు రాలేదు గానీ.. స్టంట్ వేశారు
  • 12 గంటల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయా
  • పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు ఇంజమాముల్ హక్

నాకు గుండెపోటు రాలేదు గానీ.. స్టంట్ వేశారు అంతే.. ఆస్పత్రిలో 12 గంటలపాటు ఉన్నానేమో.. వెంటనే ఇంటికెళ్లిపోయా.. పొట్టలో సమస్య వస్తుంటే చెకప్ కోసం వెళ్లడం మంచిదే అయింది.. అని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆటగాడు ఇంజమాముల్ హక్  పేర్కొన్నారు. తనకు హార్ట్ అటాక్ వచ్చిందని.. ఆస్పత్రిపాలయ్యానంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తన ఆరోగ్యం గురించి కలత చెందుతూ ఎంతో మంది తన అభిమానులు దేశ విదేశాల నుంచి  తనకు ఫోన్లు చేయడం, తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయడం చాలా సంతోషం కల్గించిందని ఇంజమామ్ పేర్కొన్నారు. 
51 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ తరపున 120 టెస్టు మ్యాచులు, 378 వన్డేలు ఆడి సుదీర్ఘకాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ స్టార్ ఆటగాడికి గుండెపోటు అంటూ వస్తున్న వార్తలపై ఆయన ఇవాళ స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు.  పొట్టలో జీర్ణక్రియ సరిగా అవడంలేదని, శ్వాస కోశ సమస్యలు కనిపించడంతో రొటీన్‌ హెల్త్‌ చెకప్‌ కోసం తాను హాస్పిటల్‌కు వెళ్లాననిని ఇంజమాముల్ హక్ తెలిపారు. తనకు చెకప్ చేసిన డాక్టర్లు యాంజిగ్రామ్‌ టెస్ట్ చేసి చూద్దామని చెప్పారని.. టెస్టు చేస్తే బ్లాక్‌ ఉన్నట్లు తేలిందన్నారు. డాక్టర్లు వెంటనే స్టెంట్‌ వేశారని, చికిత్స అనంతరం 12 గంటల్లోనే తాను ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేశానని.. ఇదీ జరిగిందని ఆయన వివరించారు. 
రొటీన్ చెకప్ కోసం వెళ్తే బ్లాక్ గురించి తెలుసుకుని, స్టెంట్‌ వేసుకోవడం మంచిదైందని... లేకుంటే గుండె సమస్యలు వచ్చేవని డాక్టర్లు తెలిపారని ఆయన చెప్పారు. తన కోసం ఇంత మంది తాపత్రయపడడం సంతోషమేస్తోందంటూ ఈ సందర్భంగా ఆయన అందరికీ ఓ సలహా ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏ కాస్త అనుమానమున్నా వెంటనే  డాక్టర్ల వద్దకు వెళ్లి చెకప్‌ చేయించుకోవాలని.. దీనివల్ల పెద్ద సమస్యలు రాకముందే  ముందు జాగ్రత్తపడే అవకాశముందని ఆయన సూచించారు.