రాయల్స్​కు చెక్ పెట్టిన చెన్నై

రాయల్స్​కు చెక్ పెట్టిన చెన్నై
  • రాజస్తాన్‌‌‌‌పై 45 రన్స్‌‌ తేడాతో విక్టరీ
  • రాణించిన బ్యాట్స్‌‌మెన్‌‌
  • చెలరేగిన అలీ, జడేజా బట్లర్‌‌ పోరాటం వృథా

బ్యాట్స్‌‌మెన్‌‌ సమష్టి కృషికి తోడు.. బౌలర్లు నిలకడైన పెర్ఫామెన్స్‌‌ చూపడంతో.. ఐపీఎల్‌‌–14లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ మళ్లీ మెరిసింది..! హార్డ్‌‌ హిట్టర్లున్న రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ను కట్టడి చేస్తూ.. వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది..! భారీ ఇన్నింగ్స్‌‌ ఆడిన బ్యాట్స్‌‌మన్‌‌ లేకపోయినా.. డుప్లెసిస్‌‌ (17 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), రాయుడు (17 బాల్స్‌‌లో 3 సిక్సర్లతో 27), బ్రావో (8 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 20 నాటౌట్‌‌) తమదైన శైలిలో రాణించడంతో.. రాయల్స్‌‌ ముందు మంచి టార్గెట్‌‌ను ఉంచింది..! బట్లర్‌‌ (35 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) పోరాడినా.. మొయిన్‌‌ అలీ (3/7), జడేజా (2/28)మ్యాజిక్‌‌ చూపెట్టడంతో రాజస్తాన్‌‌కు ఓటమి తప్పలేదు..! 

ముంబై: బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌లో పర్ఫెక్ట్‌‌ కాంబినేషన్‌‌ను సెట్‌‌ చేసుకున్న చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌.. ఐపీఎల్‌‌లో జోరు చూపెడుతోంది. గత సీజన్‌‌ వైఫల్యాలు గుర్తుకు రాకుండా నిలకడగా విజయాలు సాధిస్తోంది. తాజాగా సోమవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో సీఎస్‌‌కే 45 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 188/9 స్కోరు చేసింది.  డుప్లెసిస్​, రాయుడు పవర్‌‌ హిట్టింగ్‌‌ చేశారు. తర్వాత రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 143/9 స్కోరుకే పరిమితమైంది. బట్లర్‌‌కు తోడుగా చివర్లో ఉనాద్కట్‌‌ (24), తెవాటియా (20) ఓ మాదిరిగా ఆడారు. జడేజా నాలుగు క్యాచ్‌‌లతో అలరించాడు. మొయిన్​ అలీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 
అందరూ.. సమష్టిగా
ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ తలా కొన్ని రన్స్‌‌ జత చేశారు. స్టార్టింగ్‌‌లో ఫోర్‌‌, సిక్స్‌‌తో ఖాతా తెరిచిన రుతురాజ్‌‌ (10), డుప్లెసిస్‌‌  క్రీజులో ఉన్నంతసేపు దాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ నాలుగో ఓవర్‌‌లోనే రుతురాజ్‌‌ వెనక్కి వచ్చాడు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 25 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగియడంతో పాటు ఇక్కడి నుంచి సీఎస్‌‌కే రెగ్యులర్‌‌ విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్‌‌లో డుప్లెసిస్‌‌ 4, 4, 6, 4తో 19 రన్స్‌‌ పిండుకున్నాడు. అయితే నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో మోరిస్‌‌ (2/33)కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫించ్‌‌ హిట్టర్‌‌ మొయిన్‌‌ అలీ (26) రెండు సిక్స్‌‌లు, ఫోర్‌‌తో రెచ్చిపోయినా 10వ ఓవర్‌‌లో తెవాటియా స్పిన్‌‌కు బోల్తా కొట్టాడు. దీంతో పవర్‌‌ప్లేలో 46/2 స్కోరు చేసిన చెన్నై పది ఓవర్లు ముగిసేసరికి 82/3కి చేరింది. ఈ దశలో రైనా (18), రాయుడు  ఇన్నింగ్స్‌‌కు పెద్ద దిక్కుగా మారారు. 11వ ఓవర్‌‌లో చెరో సిక్సర్‌‌ బాదడంతో 16 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో రాయుడు వరుసగా మరో రెండు భారీ సిక్సర్లు సంధించాడు. ఆ వెంటనే రైనా ఫోర్‌‌తో జోరు పెంచాడు. ఇక సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌కు 14వ ఓవర్‌‌లో సకారియా (3/36) డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌కు 45 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ముగిసింది. ధోనీ (18), జడేజా (8) నుంచి పవర్‌‌ హిట్టింగ్‌‌ ఆశించినా.. కెప్టెన్‌‌ రెండు ఫోర్లు కొట్టి వెనుదిరిగాడు. వచ్చీరాగానే సిక్సర్‌‌ బాదిన కరన్‌‌ (13).. 18వ ఓవర్‌‌లో 15 రన్స్‌‌ పిండుకున్నాడు. 19వ ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టి జడేజా ఔట్‌‌కాగా, బ్రావో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో కరన్‌‌, శార్దూల్‌‌ (1) ఔటైనా.. ఆఖరి బాల్‌‌ను బ్రావో సిక్సర్‌‌గా మలిచాడు. ఆఖర్లో చకచకా వికెట్లు పడినా.. సీఎస్‌‌కే మాత్రం మంచి టార్గెట్‌‌నే నిర్దేశించింది. 
జడ్డూ, అలీ మ్యాజిక్​ 
టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓపెనర్​బట్లర్‌‌ నిలకడగా ఆడాడు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే రెండు ఫోర్లు, ఆ తర్వాత సిక్స్‌‌ కొట్టిన వోహ్రా (14) నాలుగో ఓవర్‌‌లో వెనుదిరిగాడు. ఐదో ఓవర్‌‌లో బట్లర్‌‌ 4, 6 బాదడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. కానీ ఆరో ఓవర్‌‌లో శాంసన్‌‌ (1) ఔట్‌‌తో పవర్‌‌ప్లేలో రాజస్తాన్‌‌ 45/2 స్కోరు చేసింది. ఈ టైమ్‌‌లో వచ్చిన దూబే (17) మంచి సమన్వయాన్ని అందించాడు. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన జడేజా బౌలింగ్‌‌లో బట్లర్​ రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌‌లో దూబే  రెండు ఫోర్లు కొట్టారు. నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో జడేజా నో బాల్‌‌ సిక్స్‌‌ ఇవ్వడంతో ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌లో రాయల్స్‌‌ 81/2 స్కోరు చేసింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌లో జడేజా మ్యాజిక్​ చేశాడు.  12వ ఓవర్‌‌ ఫస్ట్‌‌, లాస్ట్‌‌ బాల్స్‌‌కు బట్లర్‌‌, దూబేను ఔట్‌‌ చేసి రాయల్స్‌‌కు డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. దాంతో, థర్డ్‌‌ వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌లో అలీ.. మిల్లర్‌‌ (2)ను ఎల్బీ చేయడంతో రాజస్తాన్‌‌ ఇన్నింగ్స్‌‌ డీలా పడింది. పరాగ్‌‌ (3), తెవాటియా (20)పై భారీ ఆశలు పెట్టుకున్నా.. పెద్దగా ప్రయోజనం లభించలేదు. 15వ ఓవర్‌‌లో అలీ కూడా  డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌ తేడాలో పరాగ్‌‌, మోరిస్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో రాజస్తాన్‌‌  ఓటమి ఖాయమైంది.  తర్వాతి రెండు ఓవర్లలో 12 రన్సే రావడంతో విజయ లక్ష్యం 18 బాల్స్‌‌లో 80 రన్స్‌‌గా మారింది. తెవాటియాతో జతకలిసిన జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌ (24) ఓ సిక్స్‌‌, ఫోర్‌‌ కొట్టి 18 వ ఓవర్లో  13 రన్స్‌‌ రాబట్టాడు. బ్రావో వేసిన 19వ ఓవర్‌‌లో తెవాటియా వరుసగా 6, 6 కొట్టి  ఔటయ్యాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో  ఠాకూర్​ ఆరు రన్సే ఇవ్వడంతో చెన్నై ఘన విజయం అందుకుంది.