IPL 2021:ఒక్క పరుగు తేడాతో ఢిల్లీపై బెంగళూరు విక్టరీ

IPL 2021:ఒక్క పరుగు తేడాతో ఢిల్లీపై బెంగళూరు విక్టరీ

వరుసగా నాలుగు విజయాల తర్వాత గత మ్యాచ్‌‌లో  చెన్నై చేతిలో ఓటమి రుచి చూసిన రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు వెంటనే పుంజుకుంది. మంగళవారం ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో హోరాహోరీ సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఓడించింది. తొలుత ఆర్‌‌సీబీ 20 ఓవర్లో ఐదు వికెట్లకు 171 రన్స్‌‌ చేసింది. ఏబీతో పాటు రజత్‌‌ పాటిదార్‌‌ (22 బాల్స్‌‌లో 2 సిక్సర్లతో 31), గ్లెన్‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌ (20 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 25) కూడా రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన ఢిల్లీ 4 వికెట్లకు 170 రన్స్‌‌ చేసి కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. హర్షల్‌‌ పటేల్‌‌ (2/37) 2 వికెట్లు పడగొట్టగా, జెమీసన్‌‌ (1/31), సిరాజ్‌‌ (1/44) చెరో వికెట్‌‌ తీశారు. ఏబీకే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. కాగా, ఆర్​సీబీ ఇన్నింగ్స్​ ముగిసిన తర్వాత కొద్దిపాటి గాలి తుఫాను రావడంతో సెకండ్​ ఇన్నింగ్స్​ కాస్త ఆలస్యంగా మొదలైంది.

ఏబీ ధనాధన్‌‌

ఆర్‌‌సీబీ ఇన్నింగ్స్‌‌లో హీరో ఏబీ డివిలియర్సే.  ఫామ్‌‌లో ఉన్న కోహ్లీ (12), పడిక్కల్‌‌ (17), మ్యాక్స్‌‌వెల్‌‌ వికెట్లు సగం ఓవర్లలోనే కోల్పోయి 150 రన్స్‌‌ చేస్తేనే గొప్ప అనుకున్న ఆర్‌‌సీబీకి ఏబీ మంచి స్కోరు అందించాడు. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆర్‌‌సీబీకి మంచి ఆరంభమే లభించింది. జోరు మీదున్న యంగ్‌‌స్టర్‌‌ పడిక్కల్‌‌ వెంటవెంటనే మూడు ఫోర్లతో అలరించగా.. కెప్టెన్‌‌ కోహ్లీ కూడా రెండు బౌండ్రీలతో జోష్‌‌లో కనిపించాడు. కానీ, రెండు బాల్స్‌‌ తేడాతో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో ఆర్‌‌సీబీ 30/2తో కష్టాల్లో పడింది. అవేశ్‌‌ వేసిన నాలుగో ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు  కోహ్లీ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన ఇషాంత్‌‌.. ఐదో ఓవర్ ఫస్ట్‌‌ బాల్‌‌కు క్లాసిక్‌‌ డెలివరీతో పడిక్కల్​ను బౌల్డ్‌‌ చేశాడు. ఈ దశలో వన్‌‌డౌన్‌‌ ప్లేయర్‌‌ రజత్‌‌ పాటిదార్‌‌తో కలిసి నాలుగో వికెట్‌‌కు 30 రన్స్‌‌ జోడించిన మ్యాక్స్‌‌వెల్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రమాదకరంగా మారుతున్న అతడిని మిశ్రా వెనక్కుపంపడంతో 60/3తో కోహ్లీసేన కష్టాలు పెరిగాయి. ఈ టైమ్‌‌లో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌‌ ఒక్కో పరుగు జత చేస్తూ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. మరో ఎండ్‌‌లో క్రీజులో కుదురుకున్న రజత్‌‌ దూకుడు పెంచాడు. మిశ్రా, ఇషాంత్‌‌ బౌలింగ్‌‌లో రెండు సిక్సర్లు కొట్టి స్కోరు వంద దాటించాడు. అక్షర్‌‌ వేసిన 15వ ఓవర్లో స్మిత్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో ఐదో వికెట్‌‌కు 54 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది.  అయినా ఏబీ జోరు కొనసాగించాడు. రబాడ వరుస ఓవర్లో 4, 6 రాబట్టాడు. అయితే, 18వ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు సుందర్‌‌ (6)ను రబాడ రిటర్న్‌‌ క్యాచ్‌‌తో పెవిలియన్‌‌ చేర్చగా.. ఆర్‌‌సీబీ 139/5తో నిలిచింది. దాంతో, 160 రన్స్‌‌ వస్తే గొప్పే అనిపించింది.  అవేశ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో బౌండ్రీతో 36 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఏబీ.. స్టోయినిస్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 రన్స్‌‌ రావడంతో బెంగళూరు అనుకున్నదానికంటే మంచి స్కోరే చేసింది. 

హెట్‌‌మయర్‌‌, పంత్‌‌ పోరాడినా

హెట్‌‌మయర్‌‌, పంత్‌‌ చివరి బాల్‌‌ వరకూ పోరాడినా ఢిల్లీని గట్టెక్కించలేకపోయారు. భీకర ఫామ్‌‌లో ఉన్న శిఖర్‌‌ ధవన్‌‌ (6)తో పాటు స్టీవ్‌‌ స్మిత్‌‌ (4) వికెట్లు వెంటవెంటనే కోల్పోయిన క్యాపిటల్స్​కు ఛేజింగ్‌‌ స్టార్టింగ్‌‌లోనే  ఎదురీత మొదలు పెట్టింది. ఇక, మూడు ఫోర్లతో దూకుడుగా కనిపించిన యంగ్‌‌ ఓపెనర్‌‌ పృథ్వీ షా (21) ఎనిమిదో ఓవర్లో హర్షల్‌‌ వేసిన వైడ్‌‌ బాల్‌‌ను వెంటాడి కీపర్‌‌కు చిక్కడంతో 47/3తో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌‌ పంత్‌‌కు స్టోయినిస్‌‌ (22)తోడవగా.. ఆర్‌‌సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో  సగం ఓవర్లకు ఢిల్లీ 61/3తో నిలిచింది.  ఆ తర్వాత  స్టోయినిస్‌‌, పంత్‌‌ ఇద్దరూ గేరు మార్చారు.  కానీ, అదే ఓవర్లో భారీ షాట్‌‌కు ప్రయత్నించిన స్టోయినిస్‌‌ కీపర్‌‌ ఏబీకి క్యాచ్‌‌ ఇవ్వడంతో 92/4తో ఢిల్లీ డీలా పడింది. తర్వాతి ఓవర్లో సుందర్‌‌ నాలుగే రన్స్‌‌ ఇవ్వడంతో ఆ టీమ్‌‌పై ఒత్తిడి మరింత పెరిగింది. కానీ, సిరాజ్‌‌ వేసిన 15వ ఓవర్లో 6,4 సహా 14 రన్స్‌‌ రాబట్టిన హెట్‌‌మయర్‌‌ ప్రెజర్‌‌ తగ్గించాడు. చివరి ఐదు ఓవర్లలో 60 రన్స్‌‌ అవసరం అవగా.. పంత్‌‌, హెట్‌‌మయర్‌‌ క్రీజులో ఉండడంతో ఢిల్లీ ఆశలు కోల్పోలేదు. జెమీసన్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో  ఐదే రన్స్‌‌ వచ్చాయి.  చివరి 18 బాల్స్‌‌లో 46 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో హెట్‌‌మయర్‌‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. జెమీసన్‌‌ వేసిన 18వ ఓవర్లో మూడు భారీ సిక్సర్ల బాదేశాడు. దాంతో, సమీకరణం 12 బాల్స్‌‌లో 25గా మారింది.  19వ ఓవర్లో హర్షల్‌‌ 11 రన్స్‌‌ ఇవ్వగా.. లాస్ట్‌‌ ఓవర్లో 14 రన్స్‌‌ అవసరం అయ్యాయి. కానీ, ఫస్ట్‌‌ నాలుగు బాల్స్‌‌కు సిరాజ్‌‌ నాలుగు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌‌లో టెన్షన్‌‌ పెరిగింది.  ఫుల్‌‌టాస్‌‌గా వేసిన ఐదో బాల్‌‌ను పంత్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా బౌండ్రీకి చేర్చి ఆశలు రేపాడు. లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌ కొడితే ఢిల్లీదే విజయం. కానీ, సిరాజ్‌‌ మరో వైడ్‌‌ ఫుల్‌‌ టాస్‌‌ వేయగా పంత్‌‌ ఫోర్‌‌ మాత్రమే కొట్టడంతో బెంగళూరు ఊపిరిపీల్చుకుంది.

బెంగళూరు: కోహ్లీ (బి) అవేశ్‌‌ 12, పడిక్కల్‌‌ (బి) ఇషాంత్‌‌ 17, రజత్‌‌ (సి) స్మిత్‌‌ (బి) అక్షర్‌‌ 31, మ్యాక్స్‌‌వెల్‌‌ (సి) స్మిత్‌‌(బి) మిశ్రా 25, డివిలియర్స్‌‌ (నాటౌట్‌‌) 75, సుందర్‌‌ (సి అండ్‌‌ బి) 6, సామ్స్‌‌ (నాటౌట్‌‌) 3; ఎక్స్‌‌ట్రాలు:2; మొత్తం: 20 ఓవర్లలో 171/5; వికెట్ల పతనం: 1–30, 2–30, 3–60, 4–114, 5–139; బౌలింగ్‌‌: ఇషాంత్‌‌ 4–1–26–1, రబాడ 4–0–38–1, అవేశ్‌‌ 4–0–24–1, మిశ్రా 3–0–27–1, అక్షర్‌‌ 4–0–33–1, స్టోయినిస్‌‌ 1–0–23–0. 
ఢిల్లీ:  పృథ్వీ (సి) డివిలియర్స్ (బి) హర్షల్‌‌ 21, ధవన్‌‌ (సి) చహల్‌‌ (బి) జెమీసన్‌‌ 6, స్మిత్‌‌ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్‌‌ 4, పంత్‌‌ (నాటౌట్‌‌) 58, స్టోయినిస్‌‌ (సి) డివిలియర్స్‌‌(బి) హర్షల్‌‌ 22, హెట్‌‌మయర్‌‌  (నాటౌట్‌‌) 53; ఎక్స్‌‌ట్రాలు: 6;  మొత్తం: 20 ఓవర్లలో 170/4;  వికెట్ల పతనం: 1–23, 2–28, 3–47, 4–92; బౌలింగ్‌‌: సామ్స్‌‌ 2–0–15–0, సిరాజ్‌‌ 4–0–44–1, జెమీసన్‌‌ 4–0–32–1, సుందర్‌‌ 4–0–28–0, హర్షల్‌‌ 4–0–37–2, చహల్‌‌ 2–0–10–0.