
- రాణించిన గిల్, బట్లర్, కిశోర్
- బుమ్రా, బౌల్ట్ పోరాటం వృథా
ముంబై: ఐపీఎల్18లో వరుసగా ఆరు విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ టైటాన్స్ చెక్ పెట్టింది. వర్షం అంతరాయంతో ఆగుతూ.. సాగుతూ ఆఖరి బాల్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఫలితంగా ఆర్సీబీని వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చిన జీటీ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. మంగళవారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై 20 ఓవర్లలో 155/8స్కోరు చేసింది. విల్ జాక్స్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) ఫిఫ్టీతో సత్తా చాటగా, సూర్యకుమార్ యాదవ్ (24 బాల్స్‌లో 5 ఫోర్లతో 34) రాణించాడు.
జీటీ బౌలర్లలో సాయి కిశోర్ (2/34) రెండు వికెట్లు పడగొట్టగా, అర్షద్ ఖాన్ (1/18), రషీద్ ఖాన్ (1/21) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం వర్షం కారణంగా గుజరాత్ టార్గెట్‌ను డీఎల్‌ఎస్ ప్రకారం 19 ఓవర్లలో 147 రన్స్‌గా లెక్కగట్టారు. జీటీ ఏడు వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్‌కు టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (46 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), జోస్ బట్లర్ (27 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (15 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లో గెరాల్డ్ కొయెట్జీ (12), రాహుల్ తెవాటియా (11 నాటౌట్) టీమ్‌ను గెలిపించారు. బుమ్రా (2/19), ట్రెంట్ బౌల్ట్ (2/22) చెరో రెండు వికెట్లు తీశారు. గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఆదుకున్న జాక్స్
గుజరాత్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితం అయింది. జీటీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు డ్రాప్ చేయకపోతే ఆ టీమ్ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. 0, 29 రన్స్ వద్ద క్యాచ్ ఔట్ల నుంచి తప్పించుకున్న విల్ జాక్స్ కీలక ఇన్నింగ్స్‌తో ముంబైని ఆదుకున్నాడు. జీటీ పేసర్ సిరాజ్ తొలి ఓవర్లోనే సుదర్శన్ పట్టిన చురుకైన ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (2)ను పెవిలియన్ చేర్చి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అదే ఓవర్లో సుదర్శన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన జాక్స్ ఫోర్‌తో ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో పేసర్ అర్షద్ ఖాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్‌లో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ (7) ప్రసిధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికే సిరాజ్ ఓవర్లో 6, 4తో జాక్స్ జోరందుకోగా.. సూర్యకుమార్ వచ్చీరాగానే ప్రసిధ్ బౌలింగ్‌లో వరుసగా రెండు స్ట్రెయిట్ డ్రైవ్ ఫోర్లు కొట్టాడు. ఓ ఫ్లిక్ షాట్‌కు మిడ్ వికెట్‌లో సాయి కిషోర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో సూర్యకు లైఫ్ వచ్చింది. తర్వాతి బాల్‌నే బౌండ్రీకి తరలించాడు. అర్షద్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదిన జాక్స్ ఇచ్చిన మరో క్యాచ్‌ను సిరాజ్ డ్రాప్ చేయగా పవర్ ప్లేను ముంబై 56/2తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత స్పిన్నర్ సాయి కిశోర్‌కు జాక్స్ సిక్స్‌తో స్వాగతం పలికాడు. కిశోర్ వేసిన తర్వాతి ఓవర్లో జాక్స్ మరో సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో ముంబై మంచి స్కోరు చేసేలా కనిపించింది.
ఇక్కడి నుంచి జీటీ స్పిన్నర్లు వరుస వికెట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. సూర్యను కిశోర్, జాక్స్‌ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. సూర్య, జాక్స్ మూడో వికెట్‌కు 71 రన్స్ జోడించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1), తిలక్ వర్మ (7) ఫెయిలయ్యారు. కిశోర్ బౌలింగ్‌లో హార్దిక్ వెనుదిరగ్గా.. తిలక్‌ను కొయెట్జీ పెవిలియన్ చేర్చడంతో ముంబై 144/6తో డీలా పడింది. జీటీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నమన్ ధీర్ (7) ఇబ్బంది పడ్డాడు. ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లో కార్బిన్ బాష్ (27) వరుసగా రెండు సిక్సర్లు కొట్టి ఔటవగా.. లాస్ట్ బాల్‌కు దీపక్ చహర్ (8 నాటౌట్) ఫోర్ బాదడంతో ముంబై స్కోరు 150 దాటింది.
చివరకు గుజరాత్‌దే
చిన్న టార్గెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు కూడా కట్టదిట్టంగా బౌలింగ్ చేయగా.. వాన అంతరాయంతో చేతులు మారిన మ్యాచ్‌లో చివరకు గుజరాత్‌దే పైచేయి అయింది. ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (5)ను రెండో ఓవర్లోనే ఔట్ చేసిన బౌల్ట్ ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. అతనితో పాటు దీపక్ చహర్, బుమ్రా కట్టడి చేయడంతో పవర్ ప్లేలో జీటీ 29 రన్స్ మాత్రమే చేసింది. పవర్ ప్లేలో ఇబ్బంది పడ్డ బట్లర్, గిల్ ఫీల్డింగ్ మారిన తర్వాత జోరందుకునే ప్రయత్నం చేశారు. చహర్ బౌలింగ్‌లో బట్లర్ రెండు ఫోర్లతో స్పీడు పెంచగా.. హార్దిక్ వేసిన 8వ ఓవర్లో గిల్ సిక్స్ కొట్టి స్కోరు 50 దాటించాడు. తర్వాతి రెండు ఓవర్లలో కర్ణ్ శర్మ, అశ్వనీ కుమార్ చెరో ఐదు రన్సే ఇవ్వడంతో సగం ఓవర్లకు జీటీ 68/1తో నిలిచింది.
అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను తిలక్ వర్మ డ్రాప్ చేయగా.. తర్వాతి బాల్‌కే బట్లర్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు రెండో వికెట్‌కు 72 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. దాంతో ముంబై రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ .. జాక్స్ బౌలింగ్‌లో వరుసగా 4,4,6తో విజృంభించిచాడు. అశ్వనీ ఓవర్లో సిక్స్‌తో స్కోరు వంద దాటించాడు. ఈ టైమ్‌లో వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అప్పటికి జీటీ 14 ఓవర్లలో 107/2 స్కోరు నిలిచింది. ఆ టైమ్‌కు డీఆర్‌ఎస్ ప్రకారం టార్గెట్‌ను గా 99గా లెక్కగట్టగా.. జీటీ 8రన్స్ ముందంజలో నిలిచింది.
కానీ, వాన ఆగి ఆట తిరిగి మొదలైన తర్వాత ముంబై బౌలర్లు మ్యాజిక్ చేశారు. బుమ్రా అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో గిల్‌ను బౌల్డ్ చేయగా.. రూథర్‌ఫోర్డ్‌ను బౌల్ట్ ఎల్బీ చేయడంతో ముంబై తిరిగి రేసులోకి వచ్చింది. తన బౌలింగ్‌లో ఓ ఫోర్ కొట్టిన షారూఖ్ ఖాన్ (6)ను కూడా బౌల్డ్ చేసిన బుమ్రా 123/5తో జీటీని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ (2)ను అశ్వనీ కుమార్ ఎల్బీ చేసి మరో దెబ్బ కొట్టగా.. మళ్లీ వర్షం మొదలైంది.
అప్పటికి జీటీ 18 ఓవర్లకు 132/6తో నిలిచింది. ఆట తిరిగి మొదలైన తర్వాత డీఆర్‌ఎస్ ప్రకారం మరో ఓవర్‌లో జీటీకి 15 రన్స్ అవసరం అయ్యాయి. దీపక్ చహర్ వేసిన తొలి బాల్‌కు తెవాటియా ఫోర్ కొట్టగా.. మూడో బాల్‌కు కొయెట్జీ సిక్స్ బాదాడు. తర్వాతి నో బాల్‌కు కొయెట్జీ సింగిల్ తీయగా.. నాలుగో బాల్‌కు తెవాటియా కూడా ఓ రన్ తీసి స్కోరు సమం చేశాడు. కానీ, ఐదో బాల్‌కు కొయెట్జీ ఔటవడంతో ఆఖరి బాల్‌కు ఒక్క పరుగు అవసరం అయింది.లాస్ట్ బాల్‌కు అర్షద్ (1 నాటౌట్)ను రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ మిస్ చేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 155/8 (జాక్స్ 53, సూర్యకుమార్ 34, సాయి కిశోర్ 2/34)
గుజరాత్ (డీఎల్‌ఎస్ టార్గెట్ 147) : 19 ఓవర్లలో 147/7 (గిల్ 43, బట్లర్ 30, బుమ్రా 2/19, బౌల్ట్ 2/22)