ఏసీలో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి వస్తుందా..?

 ఏసీలో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి వస్తుందా..?

వేసవి కాలంలో ఉదయాన్నే లేవగానే కాస్త తలనొప్పిగా అనిపించడం చాలా మందికి సాధారణం. రోజంతా ప్రశాంతంగా సాగాల్సిన ఉదయాన్ని ఈ నొప్పి పాడు చేస్తుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండి, రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకునే రోజుల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. దీనికి కారణం ఏసీయేనా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.

ప్రముఖ న్యూరాలజీ డాక్టర్  ప్రకారం.. నిజానికి తలనొప్పి రావడానికి నేరుగా ఎయిర్ కండిషనర్ (AC) కారణం కాదు. రాత్రంతా చల్లటి గాలి నేరుగా శరీరంపై పడటం, గదిలోని గాలి పొడిగా మారిపోవడం వల్ల వచ్చే డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం), కండరాలు బిగుసుకుపోవడం వల్లే ఈ తలనొప్పి వస్తుంది.

దీనికి సంబంధించిన వివరాలు, కారణాలు చూస్తే :

కండరాలు బిగుసుకుపోవడం
ఏసీ కింద పడుకున్నాక ఉదయం తలనొప్పితో నిద్రలేవడానికి అత్యంత ముఖ్యమైన కారణం కండరాలు పట్టేయడమే. డాక్టర్  ప్రకారం, చల్లటి గాలి రాత్రంతా శరీరంపై పడినప్పుడు మెడ, భుజాలు, తల భాగంలో ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇలా చాలా గంటల పాటు కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల తలనొప్పి వస్తుంది. తలపై, ముఖ్యంగా నుదుట లేదా  తల పక్క భాగాల మీద ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. దీనితో పాటు మెడ కూడా పట్టేసినట్లు అనిపిస్తుంది.

 పొడి గాలి & డీహైడ్రేషన్ 
ఏసీ ముఖ్యమైన పని ఏంటంటే.. గదిలోని తేమను లాగేసి వాతావరణాన్ని చల్లబరచడం. దీనివల్ల రూమ్ చల్లగా మారినప్పటికీ, గదిలోని గాలి పూర్తిగా పొడిగా తయారవుతుంది. ఇలాంటి పొడి గాలి వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్  ఏర్పడుతుందని డాక్టర్  వివరించారు. పగటిపూట సరిగ్గా నీళ్లు తాగని వారికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చేరే నీటి కంటే, కోల్పోయే నీరు ఎక్కువైనప్పుడు తలనొప్పి, నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మైగ్రేన్ ఉన్నవారికి నొప్పి మరింత ఎక్కువవుతుంది.

 సైనస్ సమస్యలు పెరగడం 
పొడి, చల్లటి గాలి మన ముక్కు లోపలి భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ గాలి వల్ల ముక్కు రంధ్రాల లోపల ఉండే పొరల్లో చికాకు మొదలవుతుంది. దీనివల్ల ముందే సైనస్ సమస్య ఉన్నవారికి ముక్కు దిబ్బడ ఎక్కువై, ముఖంపై ఒత్తిడి పెరుగుతుంది. కళ్ళు, నుదుటి భాగంలో విపరీతమైన అసౌకర్యం కలిగి సైనస్ తలనొప్పికి దారితీస్తుంది. ముఖ్యంగా అలర్జీలు ఉన్నవారికి ఈ వాతావరణం అస్సలు పడదు.

 ఈ తలనొప్పి ఎవరికి ఎక్కువగా వస్తుంది
డాక్టర్   ప్రకారం.. మైగ్రేన్, సైనస్ ఇన్ఫెక్షన్లు, మెడ ఎముకల సమస్యలు, ఆస్తమా లేదా నిద్రలేకపోవడం  ఉన్నవారిలో ఏసీ వల్ల వచ్చే తలనొప్పి లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. అలాగే మనం పడుకునే పొజిషన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. తల, మెడపై నేరుగా ఏసీ గాలి పడేలా పడుకుంటే, ఆ ఒత్తిడి వల్ల ఉదయాన్నే మెడ పట్టేయడం, తలనొప్పి రావడం ఖాయం.

ఏసీ తలనొప్పి తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని  మార్గాలను సూచిస్తున్నారు:
*ఏసీ టెంపరేచర్‌ను మరీ చల్లగా కాకుండా, శరీరానికి సరిపడేలా అంటే సాధారణంగా 24°C నుండి 26°C ఉంచుకోవాలి.
*ఏసీ నుండి వచ్చే చల్లటి గాలి నేరుగా మీ మొహం లేదా మెడపై పడకుండా  Swingలోకి మార్చాలి.
*ముఖ్యంగా ఎండకాలంలో పడుకునే ముందు, రోజంతా శరీరానికి సరిపడా నీరు అందిస్తూ ఉండాలి.
* మీ గదిలో పొడిదనం మరీ ఎక్కువగా ఉంటే, గాలిలో తేమను పెంచే హ్యూమిడిఫైయర్ డివైజ్  వాడుకోవచ్చు.

చివరగా ఏసీ రూమ్‌లో పడుకున్నంత మాత్రాన తలనొప్పి రాదు. కానీ, చల్లటి, పొడి గాలికి ఎక్కువసేపు ఉండటం  వల్ల వచ్చే కండరాల నొప్పులు, డీహైడ్రేషన్, సైనస్ సమస్యలే దీనికి కారణం. కాబట్టి ఏసీ గాలిని అడ్జస్ట్ చేసుకుని, మంచి నిద్ర అలవాట్లు పాటిస్తే తలనొప్పి లేకుండా హాయిగా నిద్రపోవచ్చు