జగిత్యాల బీఆర్ఎస్‌లో వర్గపోరు 

జగిత్యాల బీఆర్ఎస్‌లో వర్గపోరు 

 

  •     కొప్పుల, విద్యాసాగరావు వర్సెస్ సంజయ్‌గా మారిన సమీకరణాలు
  •     అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా బయటపడిన విభేదాలు 
  •     ఫండ్స్ మంజూరుపై మినిస్టర్​కామెంట్లపై సంజయ్​కుమార్​క్యాడర్​ అసంతృప్తి 
  •     ఎమ్మెల్యే సంజయ్‌ను ఒంటరి చేస్తున్నారనే ఆరోపణలు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో అధికార బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలినట్లు శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. మినిస్టర్​ కొప్పుల ఈశ్వర్‌‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు వర్సెస్ ​జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్​ల మధ్య వర్గపోరు నడుస్తోందన్న చర్చ జరుగోతంది. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలోనూ, కేంద్ర ఔషధ గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై జడ్పీ 
చైర్​పర్సన్​ దావా వసంత పేరు లేకపోవడం పార్టీలో వర్గపోరుకు నిదర్శనమని క్యాడర్‌‌ మట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగిత్యాల బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే సంజయ్​కుమార్‌‌ను ఒంటరి చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. 

రెండు వర్గాలుగా బీఆర్ఎస్  

జిల్లాలో అధికార పార్టీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఒక వర్గంగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరో వర్గంగా చీలిపోయిందినే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగిత్యాల మెడికల్ కాలేజ్ పక్కన కేంద్ర ఔషధ గిడ్డంగి, హాస్పిటల్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పేరు లేకపోవడంపై ప్రొటోకాల్​ వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్‌ ఆఫీసర్లను కాకుండా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ను ఉద్దేశించినట్లుగానే ఉన్నాయని ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేశారు.  గతంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కొప్పుల ఈశ్వర్  ఫైర్ కావడంతో ఆయన అనుచరులు అసంతృప్తికి లోనయ్యారు. ఆ టైంలో అక్కడే స్టేజీపై పై ఉన్న సంజయ్ వారిని శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. పార్టీలో సంజయ్ కుమార్‌‌కు చెక్ పెట్టేందుకు ఆయన వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఆయనకు వ్యతిరేకంగా జగిత్యాలలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతను ప్రోత్సహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 

హైకమాండ్ సర్వేతో మారుతున్న సమీకరణాలు

పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ఇటీవల చేయించిన సర్వేతో జగిత్యాల బీఆర్ఎస్‌లో సమీకరణాలు మారుతున్నాయి. ఈ సర్వేలో ఎమ్మెల్యేల పనితీరులో మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పోలిస్తే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గ్రాఫ్ మెరుగ్గా ఉన్నట్లు వినికిడి. మినిస్టర్, కోరుట్ల ఎమ్మెల్యే జనాలకు కాస్త దూరంగా ఉంటుండడంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారనే అంశంపై కేటీఆర్ మందలిచ్చినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రంలో సర్కార్ ​ల్యాండ్ లీజు విషయంలో  మినిస్టర్ కొప్పుల అనుచరులకు జగిత్యాల ఎమ్మెల్యే అడ్డుతగలడంతో వీరిమధ్య విభేదాలు వచ్చినట్లగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరుకు బీఆర్ఎస్ వర్గాల్లో మరో వాదన కూడా తెర పైకి వస్తోంది. గతంలో కోరుట్ల జడ్పీటీసీ లావణ్యను జడ్పీ పీఠంపై కూర్చోపెట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రోద్భలంతో జడ్పీటీసీ దావ వసంతకు జడ్పీ చైర్‌‌పర్సన్‌గా అవకాశం దక్కింది. అయితే ఇదే జడ్పీ చైర్‌‌పర్సన్​ తాజాగా ఎమ్మెల్యే సంజయ్​ వ్యతిరేక వర్గంతో కలిసి పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.