స్ఫూర్తి ప్రదాత.. ఈ తరానికి మార్గదర్శకులు.. ఇవాళ కాకా వెంకటస్వామి (అక్టోబర్ 05) 96వ జయంతి

స్ఫూర్తి ప్రదాత.. ఈ తరానికి మార్గదర్శకులు.. ఇవాళ  కాకా వెంకటస్వామి (అక్టోబర్ 05) 96వ జయంతి

గడ్డం వెంకటస్వామి1929 అక్టోబర్ 5న నిజాం సంస్థానంలోని హైదరాబాద్​లో పుట్టారు. వారి తల్లిదండ్రులు పెంటమ్మ, మల్లయ్య. నిజాం ఆర్మీలో మల్లయ్య పని చేసేవారు. వెంకటస్వామికి 13 ఏండ్ల వయసున్నప్పుడే ఆర్మీ నుంచి బయటకొచ్చి మేస్త్రీ పనులు చేయడం ప్రారంభించారు మల్లయ్య. ఆ సమయంలో హైదరాబాద్ స్టేట్​లో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ఆదిహిందూ ఉద్యమం బాగా నడుస్తున్నది. మల్లయ్యకు వారితో మంచి సంబంధాలుండేవి. దీంతో ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 

ఆయన తన కుమారుడు వెంకటస్వామిని ఆర్యసమాజ్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఐదో తరగతి వరకు చదివిన తర్వాత మొగల్​పురా వస్తానియా స్కూలులో ఉర్దూ మాధ్యమంలో చేర్పించారు. ఎందుకంటే నిజాం పాలనలో ఉర్దూలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువుండేవి. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా రామానంద తీర్థ గారు మహాత్మా గాంధీని హైదరాబాద్​లోని వివేక వర్థిని పాఠశాలకు ఆహ్వానించారు. ఆ సమావేశానికి ఆర్యసమాజ్ విద్యార్థిగా వెంకటస్వామి  వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీని చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. ఆ ప్రేరణ ఆయన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్.

సమాజాన్ని చదివిన నేత

కాకా వెంకటస్వామి జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే.. సహజమైన ప్రజ్ఞ, ప్రజల పట్ల ప్రేమ, వారి సమస్యల పరిష్కారానికి పనిచేసే నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. ఉన్నత విద్య పూర్తిచేయకపోయినా..“సమాజం” అనే విశ్వవిద్యాలయంలో ప్రజల దైనందిన సమస్యలతోపాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలను ఎంతో లోతుగా అధ్యయనం చేశారు. వారి నాయకత్వ లక్షణాలు, కార్మిక– రైతు ఉద్యమాలు, గుడిసెవాసుల పోరాటాలు – అన్నీ వారి దార్శనికతకు, పట్టుదలకు నిదర్శనాలు.

బాల్యం నుంచే సోషలిస్టు భావాలు

బాల్యం నుంచే దేశభక్తి, సోషలిస్టు భావాలు పుణికి పుచ్చుకున్నారు వెంకటస్వామి. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, జవహర్​లాల్​ నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ వంటి మహానుభావులను ప్రత్యక్షంగా చూసి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణను నిజ జీవితంలోనూ కొనసాగించారు. రామానంద తీర్థ నాయకత్వంలో జరిగిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 

రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ సుల్తాన్​ బజార్​లో జరిగిన స్టేట్ కాంగ్రెస్ తొలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. నానల్ నగర్, నాసిక్ కాంగ్రెస్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మొదటి నుంచే గట్టిగా వాదించారు వెంకటస్వామి. 1953 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు.. ప్రతి దశలో తనదైన శైలిలో ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. 1969లో ముషీరాబాద్​లో జరిగిన పోలీస్ కాల్పుల్లో కాకాకు బుల్లెట్ గాయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూసి సంతోషించారు.

ఈ తరానికి మార్గదర్శకులు

ప్రజాహితం, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన అంకిత భావం ఈ తరానికి మార్గదర్శకం. కార్మి కులైనా, కంపెనీ యజమానులైనా, సాధా రణ ప్రజలైనా, పెద్ద రాజకీయ నాయ కులైనా అందరూ ప్రేమగా, గౌరవంగా “కాకా” అని పిలిచే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి దాదాపు వచ్చినట్లే వచ్చి చేజారిపో యినా నిరాశ పడలేదు. రాష్ట్రపతి పదవి పొందడానికి అవకా శాలుండి దక్కకపో యినా  ప్రజల పక్షం వీడని గొప్ప నాయకుడు. వారి జన్మదినం సందర్భంగా వారిని గుర్తుచేసుకోవడం, వారు నిర్వ హించిన పనులను స్ఫూర్తిగా తీసుకో వడం ఈ తరానికి ఎంతో అవసరం.

101 కార్మిక సంఘాలకు నాయకత్వమంటే మాటలా?

వెంకటస్వామి దాదాపు 101 కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. కార్మికుల హక్కుల సాధనలో, వేతనాల పెంపులో ఆయన పాత్ర ఎనలేనిది. దేశంలో ఎక్కడాలేని విధంగా 1949లోనే నేషనల్ హట్స్ యూనియన్​ను ఏర్పాటుచేసి 20 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేశారు. దాదాపు 80 వేల గుడిసెవాసులకు స్థిర నివాసం కల్పించారు. ఆ సమయంలో జమీందారులు, ప్రభుత్వం నుంచి ఎన్నో ఒత్తిడిలున్నా వెనక్కి తగ్గలేదు. పేదల పక్షాన నిలబడి వారికి పట్టాలు ఇప్పించారు. 

అనేక ఉద్యమాల కారణంగా ఆయన చిన్న వయసులోనే ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా సేవలందించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక శాఖ, సివిల్ సప్లైస్​, జౌళీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీమ్, పేదల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ, బాల కార్మిక నిర్మూలన నిర్ణయం, గ్రామీణ పరిపాలన సంస్కరణలు – ఇవన్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి.

అందరికీ విద్యే ఆయన లక్ష్యం

అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 1973లో హైదరాబాద్​లో డాక్టర్  బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్​ను కాకా స్థాపించారు. ఈ కళాశాల ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 52 ఏండ్లుగా ఈ విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఉపాధి నైపుణ్యాలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో నాక్ గుర్తింపు పొంది, యూజీసీ “అటానమస్ స్టేటస్” పొందిన కళాశాలలుగా ఇవి పేదలకు, దళితులకు ఎన్నో రకాల సంక్షేమ వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాయి. వెంకటస్వామికి ప్రజల సమస్యలపై స్పందించే స్వభావం, వాటిని పరిష్కరించే నిబద్ధత, అందరినీ కలుపుకొని పోయే నాయకత్వ లక్షణాలుండేవి. పైకి ఆయన సాధారణంగా కనిపించినా.. అసాధారణమైన పనులు చేశారు. ఏదైనా సాధించాలనే సంకల్పంతో నిరంతరం పనిచేస్తూనే ఉండేవారు. ఆయన గొప్ప ఆత్మవిశ్వాసం గల మనిషి, ధైర్యసాహసాలతో కూడిన నాయకుడు.

- ఆచార్య 
ఆర్. లింబాద్రి