ఉత్సాహంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీ

 ఉత్సాహంగా కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీ

హనుమకొండ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ-20 సెకండ్ ఫేజ్ క్రికెట్ పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 8 నుంచి 10 తేదీ వరకు మూడు రోజులపాటు పోటీలు జరుగనున్నాయి. జనగామ జిల్లా వంగాలపల్లి గ్రౌండ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్ ఛార్జ్ సెక్రటరీ బస్వరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ చాంద్ జైన్, వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. 

వంగాలపల్లి గ్రౌండ్ లో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా..  రెండు టీమ్ లు హోరాహోరీ తలపడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో మహబూ‌‌‌‌బ్ నగర్ జట్టు  88 రన్స్ కొట్టగా, ఆదిలాబాద్ 89 పరుగులు సాధించి విజయాన్ని చేజిక్కించుకుంది. ఆదిలాబాద్ టీమ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిన అశ్విక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెకండ్ సెషన్ లో జరిగిన మరో మ్యాచ్ లో నిజామాబాద్ జట్టు నల్గొండ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిజామాబాద్ టీమ్ లోని శ్రీకర్ రెడ్డి సెంచరీతో జట్టు మొత్తంగా 218 పరుగులు చేయగా.. నల్గొండ 154 రన్స్ కే ఆలౌట్ అయ్యింది.

ఉత్కంఠగా రంగారెడ్డి, హైదరాబాద్ మ్యాచ్..

మరోవైపు హనుమకొండ రెడ్డిపురంలోని టీవీవీఎస్ సుకాంత్ క్రికెట్ గ్రౌండ్ లో రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల హోరాహోరీ తలపడ్డాయి. రెండు జట్ల మధ్య చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఒక రన్ తేడాతో హైదరాబాద్ జట్టు విజయాన్ని అందుకుంది. మొదట టాస్  గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన రంగారెడ్డి టీమ్ 161 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

కాగా హైదరాబాద్ జట్టులో 62 పరుగులు చేసి, టీమ్ విజయంలో కీలకంగా నిలిచిన వాసుదేవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. సెకండ్ సెషన్ లో ఖమ్మం, మెదక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఖమ్మం టీమ్ లో దీవిన్ చేసిన సెంచరీతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి జట్టు 202 పరుగులు చేయగా.. మెదక్ 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్ గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.