
- నెల దాటినా ఇటు వైపు కన్నెత్తి చూడలే
- భూములు తీసుకుని.. ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్
పెద్దపల్లి, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు బాధితులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బ్యారేజీల కింద మునుగుతున్న భూములను ప్రభుత్వం తీసుకోవాలని, ఎకరానికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్చెప్పి నెల రోజులైనా ఎలాంటి చర్యలు లేకపోవడంతో రెండు రోజుల కింద అన్నారం బ్యారేజీ ముంపు గ్రామాలైన ఆరెంద, మల్లారం, ఖాన్సాయిపేట, అమ్మగారిపేట ముంపు బాధితులు మంథని మెయిన్ రోడ్డు మీద రాస్తారోకో చేశారు. ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.
సర్వే నివేదిక అందలేదంటున్నరు...
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు రెండేళ్లుగా క్రాప్ హాలిడే పరిహారం కూడా ఇవ్వాలని కాళేశ్వరం బ్యారేజీల ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లు మునిగిన పంటలకు సంబంధించి సర్వే చేశారు.ఈ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో పరిహారం అందడంలేదని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వమే భూములను తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని రైతులు కోరుతుండడంతో భూసేకరణపైనా అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అయినా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారు. ఈ బ్యారేజీల నిర్మాణంలో గోదావరి వరదను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లోకల్ స్ట్రీమ్స్, క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వచ్చే వరదను అంచనా వేయలేదు. దీంతో బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ వాటర్‌లో మంథని, రామగుండం, వెల్గటూరు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రైతులు పంటలు వేయడం మానేశారు.
పరిహారం ఒక్కసారే ఇచ్చి ఆపేసిండ్రు....
గత మూడేళ్లలో ఏటా రెండు పంటల చొప్పున ఆరు పంటలను రైతులు నష్టపోయారు. మొదట్లో ఒక సీజన్లో అధికారులు నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19వేల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత ఐదు సీజన్లలో రూపాయి కూడా ఇవ్వలేదు. ముంపు ప్రమాదం ఉన్నందున పంటలు వేయవద్దని, క్రాప్ హాలీడే పరిహారం ఇస్తామని అధికారులే చెప్పారని, ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వలేదని రైతులు అంటున్నారు. ప్రాజెక్టు కట్టకముందు బోర్ల కింద ఏటా రెండు పంటలు పండించేవాళ్లమని, వరదలో బోర్లు,పైప్లైన్లు కూడా మునిగిపోయాయని వాపోతున్నారు. అన్ని విధాలుగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
భూములను సర్కార్ తీసుకోవాలే
నాకు 4 ఎకరాలు ఉంది, మూడేండ్లలో ఆరు సార్లు పంట వేసిన, ప్రతీ యేటా చేతికచ్చే టైంలో పంటలు మునిగిపోయాయి. ఒక్కసారి మాత్రమే పరిహారం ఇచ్చారు. పంట చేతికి రాకపోతదా అనే ఆశతో సాగు చేస్తుంటే .. ప్రతిసారి ముంపు తప్పుత లేదు. అందుకే భూములను తీసుకొని పరిహారం ఇవ్వాలని కోరుతున్నం.
–సుంకరి బాపు, మల్లారం, పెద్దపల్లి జిల్లా
మూడేండ్లుగా నష్టపోతున్నం
మూడేళ్లుగా పంటలు వేసి నష్టపోతున్నాం, కాళేశ్వరం నిర్మాణంలో అధికారుల తప్పుకు మేము బలి అవుతున్నం. వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నం, పంటలు మునిగి మూడేళ్లుగా అప్పుల పాలైతున్నం. మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ఎకరానికి రూ. 20 లక్షలిచ్చి మా భూములను తీసుకొవాలి.
–గూడెపు సుశీల, ఆరెంద, పెద్దపల్లి జిల్లా
ముంపు బాధితులకు న్యాయం చేయాలే
కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజీ కింద మంథని మండలంలోని చాల గ్రామాల్లో భూములు ముంపునకు గురవుతున్నాయ్. ఆ భూములను ప్రభుత్వం తీసుకొని రైతులకు పరిహారం అందించాలి. ప్రతీ యేటా మునుగుతుండటంతో రైతులు భూములను పడావు పెడుతున్నరు. బతకడానికి కూలీలుగా మారుతున్నరు, అప్పుల పాలైతున్నరు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలి.
–చందుపట్ల సునీల్‌రెడ్డి, బీజేపీ స్టేట్ లీడర్, మంథని