
కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత బి.ఐ. హేమంత్ కుమార్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, ఓ టెలివిజన్ నటి, రియాలిటీ షో విజేతపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.. దీంతో లైంగిక వేధింపులు, మోసం, నేరపూరిత బెదిరింపుల కింద హేమంత్‌ను రాజరాజేశ్వరి నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేధింపుల పర్వం
బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2022లో హేమంత్ కుమార్ ఆమెను సంప్రదించి, తన తదుపరి సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ పాత్రకు గాను రూ.2 లక్షల పారితోషికానికి ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ. 60,000 కూడా నటికి చెల్లించారు. అయితే, ఆ తర్వాతే వేధింపుల పర్వం మొదలైంది. హేమంత్ షూటింగ్‌ను ఆలస్యం చేయడమే కాకుండా, నటిపై అసభ్యకరమైన దుస్తులు ధరించాలని, అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వేధించడం ప్రారంభించినట్లు ఆరోపించింది. సినిమా ప్రమోషన్ నిమిత్తం ముంబైకి వెళ్లినప్పుడు కూడా ఆయన తనపై అనుచితంగా తాకాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది.
మత్తుమందు, వీడియో బ్లాక్‌మెయిల్
హేమంత్ 2023లో మరింత వేధింపులకు గురి చేశాడని బాధితురాలు పేర్కొంది. డ్రింక్‌లో మత్తుమందు కలిపి, స్పృహలో లేని సమయంలో వీడియో తీశాడని ఆరోపించింది. ఆ తర్వాత ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడని వాపోయింది. తనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా రౌడీలను, గూండాలను పంపి తనను, ఆమె తల్లిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది..తన భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆమె పోలీసులకు తెలిపారు.
ఆర్థిక మోసం, కోర్టు ధిక్కరణ
లైంగిక వేధింపులతో పాటు, హేమంత్ కుమార్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడు. ఆయన ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడమే కాకుండా, నటి అనుమతి లేకుండా.. సినిమాలోని సెన్సార్ చేయని సన్నివేశాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ఆమె పరువుకు భంగం కలిగించాడని పేర్కొంది. దీంతో హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.