డెడ్​బాడీ తీసుకెళ్లేందుకు తిప్పలు

డెడ్​బాడీ తీసుకెళ్లేందుకు తిప్పలు

భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు : జ్వరంతో బాధపడ్తూ ఆస్పత్రిలో చనిపోయినకొమరం లక్ష్మి (60) అనే మహిళ డెడ్​బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు బుధవారం అష్టకష్టాలు పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామ పంచాయతీలోని రాయునిపేట గ్రామానికి చెందిన కొమరం లక్ష్మి జ్వరంతో బాధపడ్తూ రెండు రోజుల కిందట భద్రాచలం వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆమె మృతి చెందారు. ఆమె డెడ్​బాడీని వెహికల్​లో కుటుంబ సభ్యులు కరకగూడెం–చిరుమల్ల మధ్యగల పెద్దవాగు వరకు తీసుకెళ్లారు. 

ఇక్కడ రోడ్డు కొట్టుకపోవడంతో వాగులోంచే నానా అవస్థలు పడి బాడీని మోసుకుంటూ అవతలి వైపుగల చిరుమల్లకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాయునిపేటకు బాడీని తీసుకెళ్లారు. జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కరకగూడెం–చిరుమళ్ల గ్రామాల మధ్య పెద్దవాగుపై గల బ్రిడ్జికి అనుకొని ఉన్న రోడ్డు (చిరుమళ్ల వైపు వెళ్లే రోడ్డు) గత నెలలో కురిసిన వర్షాలకు కొట్టుకపోయింది. బ్రిడ్జి ఉన్నా వంతెనకు ఆనుకొని ఉన్న రోడ్డు లేకపోవడంతో ఇరు గ్రామాల ప్రజలు వాగులోంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు రిపేరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.