
- సూచనలతో కూడిన నోటీసులతోనే సరిపెడుతున్న వైనం
- కనీసం ఫైన్లు కూడా వేయకపోవడంపై అనుమానాలు
- ఫైన్లు వేసే అధికారం తమకు లేదంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
- కఠిన చర్యలు తీసుకోకపోవడంతో లైట్ తీసుకుంటున్న వ్యాపారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్లు ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేశారు. అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప.. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించేలా ఫుడ్ తయారు చేస్తున్న హోటళ్లు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన ఆఫీసర్లు తనిఖీలను పెంచినప్పటికీ.. కేవలం నోటీసులకే పరిమితం కావడం, ఫైన్లు వేయడంలో జాప్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చట్ట ప్రకారం తమకు ఫైన్లు వేసే అధికారం తమకు లేదని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తుండగా.. కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఈ దాడులను లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏ హోటల్ కిచెన్ చూసినా అధ్వానంగానే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హోటళ్లలో ఏ కిచెన్ చూసినా గోడలు, కిచెన్ గట్లు నల్లగా జిడ్డుపట్టి కనిపిస్తున్నాయి. నాణ్యత లేని వంట సరుకులు, గడువు తీరిన మసాలాలు, సామగ్రి, రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసం, ఆహార పదార్థాలు, ఆహారంలో వాడకూడని రంగులు, అక్కడే తిరుగుతున్న ఎలుకలు, బల్లులు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చే కల్తీ ఆయిల్ వంటల్లో వినియోగిస్తున్నారు. కనీసం హైజనిక్ ఉండడం లేదు. కిచెన్ పరిసరాలు చూస్తేనే వాంతికి వచ్చేలా ఉంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రెస్టారెంట్ల నుంచి చిన్నహోటళ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ హోటళ్లపైనా గతంలో దాడులు నిర్వహించి ఎక్స్ పైరీ అయిన ఐటెమ్స్ గుర్తించినప్పటికీ.. రూ.10 వేలు, రూ.20 వేలు ఫైన్‌తో బయటపడుతున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పికాక్ మయూర హోటల్ పై రెండు సార్లు మున్సిపల్ శానిటేషన్ విభాగం ఆఫీసర్లు ఫైన్లు వేశారు. చాలా హోటళ్లపై ఫిర్యాదులు వస్తే తప్ప ఈ మాత్రం దాడులు కూడా చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బేకరీలు, స్వీట్ హౌస్ ల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు..
బేకరీలు, స్వీట్ హౌస్ ల తయారీ స్థలాల్లోనూ కనీసం శుభ్రత పాటించడం లేదు. కేక్‌లు, స్వీట్ల తయారీలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. చాలా షాపుల్లో అమ్ముడుపోక గడువు తీరిన స్వీట్లు, కేక్‌లను రోజుల తరబడి నిల్వ చేసి అమ్మేస్తున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన దాడుల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి.
కేక్‌లకు వాడే స్పాంజ్‌ను బేకింగ్ చేసే ప్రక్రియలో బటర్ పేపర్‌కు బదులు న్యూస్ పేపర్ ను వాడుతున్నారు. కేక్ తయారీలో వాడే ఫుడ్ కలర్స్‌లో గడువు తీరిన బాటిల్స్ వినియోగిస్తున్నారు. చాలా బేకరీల్లో కేక్స్ పైన తయారు చేసిన తేదీ, ఎక్స్ పైరీ తేదీకి సంబంధించిన లేబులింగ్ వేయడం లేదు. సరైన ఉష్ణోగ్రతలో స్టోర్ చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన కొన్ని..
ఆగస్టు 30న కరీంనగర్ ముకరంపురలోని నారాయణి బేకరీ, సెవెన్ హిల్స్ కాంప్లెక్స్ స్వగృహ ఫుడ్స్, మార్కెట్ రోడ్డులోని కల్పన బేకరీ అండ్ స్వీట్ హౌస్ లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్ పైరీ అయిన కలర్స్, కేకులపై మాన్యుఫ్యాక్చరింగ్, ఎక్స్ పైరీ డేట్స్ లేకపోవడం, క్వాలిటీ ఆయిల్ వాడకపోవడం, తయారు చేసిన స్వీట్స్, కేక్స్‌ను సరిగా స్టోర్ చేయకపోవడం గుర్తించారు.
ఆగస్టు 29న సిటీలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్, నటరాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. దర్బార్ బార్‌లో ముందు రోజు మిగిలిన మటన్, కార్న్, వెజ్ మంచురియాను గుర్తించి పారేశారు. నటరాజ్ బార్ కిచెన్ దుర్వాసన వస్తూ అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బార్లకు నోటీసులు జారీ చేశారు.
ఆగస్టు 20న సిటీలోని అనిల్, ఆనంద్, మహారాజా స్వీట్ హౌస్ లను తనిఖీ చేసి, స్వీట్ తయారు చేసే ముడిపదార్థాలపై బల్లుల మలం, ఈగలు, దోమలు ఉండడం గుర్తించారు. షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
ఆగస్టు 12న కమాన్ చౌరస్తాలోని మోర్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించి ఎక్స్ పైరీ అయిన వస్తువులను గుర్తించి పారబోయించారు.
అడిషనల్ కలెక్టర్‌కు రిపోర్టు ఇచ్చాం..
జిల్లాలో ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర షాపుల్లో 30 వరకు తనిఖీలు నిర్వహించాం. ఇందులో రూల్స్ ఉల్లంఘన, లోపాలను గుర్తించి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. నోటీసుల్లో వారు చేయాల్సిన మార్పుల గురించి క్లియర్‌గా వివరించాం. వీటిపైనే మున్సిపాలిటీవాళ్లలాగా వెంటనే ఫైన్లు వేసే అధికారం మాకు లేదు. నోటీసులు జారీ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్ లు, బేకరీలు, షాపులపై అడ్జడికేషన్ ఫైల్ చేసి అడిషనల్ కలెక్టర్‌కు సమర్పిస్తాం. - అంకిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్, కరీంనగర్