నేను రాజీనామా చేయలేదు..వాళ్లే అడిగితే చేశా

నేను రాజీనామా చేయలేదు..వాళ్లే అడిగితే చేశా
  • పాదయాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: ‘‘నేను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదు. వాళ్లే నన్ను రాజీనామా చేయమని అడిగితే చేశా.. నేను పార్టీని విడిచిపెట్టలేదు. వదిలిపెట్టేలా చేశారు..’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హజూర్ నగర్ నియోజకవర్గంలో తలపెట్టిన పాదయాత్ర ఇల్లందకుంట మండలం సీతంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలనుద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తిని నేను. మంత్రి నయ్యాక కూడా కేసుల కోసం గంటల కొద్దీ కోర్టుల దగ్గర గడిపాను. అయిన వాడికి ఆకుల్లో, కాని వాళ్లను కంచాల్లో పెట్టాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో పులిబిడ్డల్లా కొట్లాడిన వాళ్లంతా బజార్లో పడ్డారు. మా రక్తాన్ని కళ్ల చూసిన వారు, అవమానించిన వారు ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారు..’’ అని ఆరోపించారు. నాది రాజకీయ పార్టీ, నాకు అధికారం, నాకు కుర్చే ముఖ్యమంటున్నాడు, దళితులపై ప్రేమతో కాదట.. వారి ఓట్లకోసమే పది లక్షలు ఇస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే దళితులకు పది లక్షలు ఇస్తానని నిన్న కేసీఆర్ బరితెగించి చెబుతున్నాడని, తనను ప్రశ్నించేవాడు తెలంగాణ గడ్డమీద ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. ‘‘బానిసలుగా బతికేవాళ్లు కావాలట.. నేను బానిసను కాదు కాబట్టే నన్ను ఓడించాలని చూస్తున్నారు. 
నా ముఖం అసెంబ్లీలో కనిపించొద్దట.. నా ముఖమే కదా ఆనాడు ఆంధ్రా పెత్తందార్లను ఎదిరించింది.. నా మొఖమే కదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపింది.. నా గొంతే కదా తెలంగాణ ప్రజల గోస వినిపించింది.. మీకు ఫించన్ కావాలన్నా.. కొనుగోలు కేంద్రాలు కావాలన్నా.. మొక్కజొన్నలు కొనాలన్నా.. నేను మాట్లాడితేనా కదా వచ్చాయి..’’ అని ఈటల పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్నలు 1300-1350కి అమ్ముకున్నారు, క్వింటాలు మీద 600 చొప్పున ఎకరాకు 15 వేల చొప్పున నష్టపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు పేరిట ఐదువేలిచ్చి.. మొక్క జొన్నలకు పదిహేనువేల నష్టం కలిగించారని, మంత్రిగా ఉండి కూడా ఫించన్లు, తెల్లకార్డులు ఇప్పించలేకపోయామన్నారు. మూడేళ్లుగా ఒక్కరికైనా కొత్త ఫించన్ ఇచ్చారా ? ఓట్లకు ముందు 57 ఏళ్లు నిండితే ఫించన్ అన్నాడు ఏమైంది ? ఇప్పుడు ఓట్లకోసం, నావాళ్ల హుజురాబాద్ లో 11 వేల మందికి కొత్త ఫించన్లు, తెల్లరేషన్ కార్డులు వస్తున్నాయి.. నా దళిత జాతికి పది లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడు.. హుజురాబాద్ తో పాటు రాష్ట్రమంతా ఉన్న దళితులందరికీ  పదిలక్షలు చొప్పున ఇవ్వాలి.. ఓట్లున్నదగ్గరే గొల్లకుర్మలకు గొర్రెలిస్తారు.. వాళ్ల మీద ప్రేమపై మాత్రం కాదు..’’ అని ఈటల దుయ్యబట్టారు. ఇంత కుంభవృష్టిలో కూడా ప్రజలు తనకు తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారని, రాబోయే కాలంలో కూడా ఇప్పటిలాగే ఉంటా, హుజురాబాద్ అంటే రాష్ట్రమంతా గర్వపడేలా ఉంటానని చెప్పారు. ఓటుకు పదివేలిస్తారట. తీసుకోండి.. కానీ ప్రశ్నించే బిడ్డను, తెలంగాణలో నిఖార్సైన బిడ్డను ఆశీర్వదించండి అని ఈటల కోరారు. ఎంగిలి మెతుకుల కోసం మనం మోసపోవద్దని, పరిగె ఏరుకుంటే లాభం లేదు.. పంట పండితేనే కడుపు నిండుతుందని ఈటల రాజేందర్ సూచించారు.