‘బ్రాండ్ బెంగళూరు’ గురించి .. మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: సిద్ధరామయ్య

‘బ్రాండ్ బెంగళూరు’ గురించి .. మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: సిద్ధరామయ్య

బెళగావి : ‘బ్రాండ్ బెంగళూరు’ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్​ అయ్యారు. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని బీజేపీ నేతలు ఆరోపించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగళూరును గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘బ్రాండ్ బెంగళూరు’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా బుధవారం సిద్ధరామయ్య స్పందించారు.

మేము వచ్చి ఆరు నెలలే

‘‘మేం ఆరు నెలల క్రితమే అధికారంలోకి వచ్చాం. అంతకు ముందు బీజేపీ నాలుగేండ్లు అధికారంలో ఉంది. ఆ సమయంలో వారు ఏం చేశారు?”అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.  ‘‘బీజేపీ నేతలు గుంతలు కూడా పూడ్చలేకపోయారు”అంటూ ఆయన మండిపడ్డారు. అలాగే, కర్నాటక మంత్రులంతా తెలంగాణలో క్యాంప్‌‌ వేయడంతో (కాంగ్రెస్‌‌ ఎన్నికలకు సంబంధించిన పనుల కోసం) రాష్ట్రంలో పాలన దెబ్బతింటోందని బీజేపీ నేతలు ఆరోపించగా.. మంత్రులందరూ వెళ్లలేదని, కొందరు మాత్రమే తెలంగాణకు వెళ్లారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

అలాగే ‘‘మేము కూడా రాజకీయాలు చేయాలి. తెలంగాణ ప్రజలే కర్నాటక మంత్రులను పిలిచారు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి మునియప్ప, ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్‌‌ తిరిగి వచ్చారని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌, హౌసింగ్‌‌ మంత్రి బీజెడ్‌‌ జమీర్‌‌ అహ్మద్‌‌ఖాన్‌‌ తెలంగాణలోనే ఉన్నారని 
సిద్ధరామయ్య చెప్పారు. ప్రతిపక్ష నాయకులు  ఊరికే విమర్శలు చేయకుండా, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని కోరారు.