అమృత దుకాణాలు..రైతుల కోసం వినూత్న పథకం

అమృత దుకాణాలు..రైతుల కోసం వినూత్న పథకం

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత  ప్రయాణానికి పచ్చ జెండా ఊపిన సిద్దరామయ్య ప్రభుత్వం..తాజాగా రైతుల కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. కర్ణాటక వ్యాప్తంగా నందిని డెయిరీ తరహాలో కూరగాయల స్టాల్స్ను ఏర్పాటు చేయనుంది.  రైతులు తాము పండించిన కూరగాయలను ఈ స్టాల్స్ ద్వారా విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.  

రైతుల కోసం స్టాల్స్...

కర్ణాటకలో  మే30వ తేదీన పైలెట్ ప్రాజెక్టుగా  చేపట్టిన రెండు  కూరగాయల స్టాల్స్ ను ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి  ప్రారంభించారు. ఈ కూరగాయల స్టాళ్లకు అమృత మలిగే (అమృత దుకాణాలు) అని పేరు పెట్టారు. ఈ అమృత దుకాణాలు నందిని డెయిరీ స్టాళ్ల పక్కనే ఏర్పాటు చేశారు. స్థానికంగా కూరగాయలు పండించే రైతులు..ఈ అమృత దుకాణాల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ స్టాళ్లు విజయవంతం కావడంతో త్వరలో కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో అమృత దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. 

అగ్రికల్చర్ పోస్టులు భర్తీ చేస్తాం

కర్ణాటక వ్యవసాయ శాఖలో దాదాపు 58శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి చలువరాయస్వామి తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి పర్మినెంట్ ఉద్యోగులను లేదా కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలా అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. వ్యవసాయ శాఖలో 8,982 పోస్టులు ఉండగా, దాదాపు 5,195 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీని వల్ల  వ్యవసాయ శాఖ కార్యక్రమాలను రైతులకు తెలియజేయడంలో కొద్దిగా జాప్యం జరుగుతోందని మంత్రి తెలిపారు.

రైతులకు అందుబాటులో విత్తనాలు

రాష్ట్రంలో రైతుల అవసరాలన్నీ తీర్చాలని వ్యవసాయ మంత్రి చలువరాయస్వామి అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వస్తువులను నాట్లు వేయకముందే రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ ఖరీఫ్ లో 82.35 లక్షల హెక్టార్లలో నాట్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..అందుకోసం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు.  2022--23 సీజన్‌లో రాష్ట్రంలో 139.28 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చలువరాయస్వామి చెప్పారు. 5.54 లక్షల క్వింటాళ్ల విత్తనాల డిమాండ్‌ అంచనా వేయగా, రాష్ట్రంలో 7.85 లక్షల క్వింటాళ్ల నిల్వలు ఉన్నట్లు తెలిపారు.