కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ IAS అధికారి మహంతేష్ బిలగి నిన్న (నవంబర్ 25) మంగళవారం సాయంత్రం కలబురగి జిల్లా జెవర్గి తాలూకాలోని గోనహళ్లి క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ఇద్దరు బంధువులు శంకర్ బిలగి, ఈరన్న బిలగి కూడా ఈ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
51 ఏళ్ల IAS అధికారి అయినా మహంతేష్ బిలగి బెళగావి జిల్లాలోని రాందుర్గ్ నుండి కలబురగిలో పెళ్ళికి హాజరయ్యేందుకు వెళుతుండగా సాయంత్రం 5.30 గంటల సమయంలో టయోటా ఇన్నోవా కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో శంకర్, ఈరన్న అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మహంతేష్ బిలగిని కలబురగిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
కర్ణాటక కేడర్ కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మహంతేష్ బిలగి రామ్ దుర్గ్ కు చెందినవారు. కెఎస్ఎంసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు దావణగెరె డిప్యూటీ కమిషనర్ & బెస్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. పట్టణాభివృద్ధి, ఫిర్యాదుల పరిష్కారం, విద్యుత్ సరఫరా నిర్వహణను మెరుగుపరచడంలో తన కృషికి పేరుగాంచిన మహంతేష్ బిలగి, సివిల్ సర్వీసెస్ లో చేరడానికి ముందు ధార్వాడ్ లో ఇంగ్లీష్ ట్యూటర్ గా కూడా పనిచేశారు.
ఈ సంఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విచారం వ్యక్తం చేస్తూ కర్ణాటక రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ ఐఎఎస్ అధికారి మహంతేష్ బిలగి కారు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం అని అన్నారు.
మహంతేష్ బిలగి బెస్కామ్(Bescom) ఎండీగా కూడా పనిచేశారు అలాగే దావణగెరె, ఉడిపితో సహా కర్ణాటక అంతటా వివిధ పదవులను నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా ఆరోగ్య & కుటుంబ సంక్షేమ అధికారి సహా సీనియర్ అధికారులు ఆసుపత్రిని సందర్శించి విచారం వ్యక్తం చేసారు.
