ప్రజలు గొర్రెలు.. పైసలిస్తే ఓట్లేస్తారని అనుకుంటుండు కేసీఆర్ 

V6 Velugu Posted on Sep 26, 2021

  • తెలంగాణ సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమే అన్నట్లుగా మారింది
  • దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని ఇండియా టుడే  సర్వేలో తేలింది
  • అవినీతి డబ్బుతో హుజూరాబాద్ లో గెలవాలని చూస్తున్నాడు

హనుమకొండ జిల్లా: ‘‘ప్రజలు గొర్రెలు.. పైసలిస్తే ఓట్లేస్తారని అనుకుంటుండు కేసీఆర్ .. తెలంగాణ సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమే అన్నట్లుగా మారింది.. దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని ఇండియా టుడే  సర్వేలో తేలింది.. అవినీతి డబ్బుతో హుజూరాబాద్ లో గెలవాలని చూస్తున్నాడు..’’ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో  వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఈటలతో పాటు నేను ముందుండి పోరాడం.. ఆస్తులు ఖర్చు చేశామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ తెస్తానన్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక నియంతలాగా పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్, ఆయన కుటంబ సభ్యులే తెలంగాణను పాలిస్తూన్నారని, రాష్ట్రంలో ఇంత గొడవ నడుస్తుంటే.. కేసీఆర్ తిరుపతి తిరుమల దేవస్థానంలోనూ వారి కుటుంబ సభ్యులు ఐదుగురికి పదవులు ఇప్పించుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమే అన్నట్లుగా మారిందన్నారు. 
కేసీఆర్ అందర్నీ అవసరానికి వాడుకుని పక్కనపెట్టే రకం
కేసీఆర్ తన అవసరానికి అందరినీ వాడుకుని పక్కన పెడతాడని, నమస్తే తెలంగాణ పత్రిక కోసం ఈటల రాజేందర్ సొంత భూమి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాడని, ఇప్పుడు అదే భూమిపై ఈటలపై భూ ఆక్రమణ ఆరోపణలు చేసి పక్కన పెట్టాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. నేను కూడా టీఆర్ఎస్ కు ఓనర్నని అన్నందుకు, వడ్ల కొనుగోలు ఉండాలన్నందుకే ఈటలపై కేసీఆర్ కోపం పెంచుకున్నాడని, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని ఈటల కొట్లాడారు, భూస్వాములకు కాకుండా.. సాగు చేసేవారికే రైతు బంధు ఇవ్వాలని అడిగారు, దీంతో ఈటల రాజేందర్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని కేసీఆర్ భావించి బయటకు పంపించేశారని విమర్శించారు. 
కేసీఆర్ కు అధికార గర్వం తలకెక్కింది
అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ కు తనకు ఎదురులేదన్న భావనతో అధికార గర్వం తలకెక్కిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని ఇండియా టుడే  సర్వేలో తేలిందని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు రాకముందు నుంచే ఈటలకు పౌల్ట్రీ ఫారమ్స్ ద్వారా సంపాదించుకున్న 200 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఈటల రాజేందర్ పన్ను చెల్లించి సంపాదించుకున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం పన్నులు కట్టకుండానే సంపాదిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మనం చెల్లించే పన్నులు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశాడని విమర్శించారు. ఎప్పుడూ ఫామ్ హౌస్ లో పడుకుని ఆస్తులు ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాడన్నారు. మిషన భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం చేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో 30 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు.
ఈటలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి మనం బుద్ధి చెప్పాలి 
దుర్వినియోగం చేసిన డబ్బులన్నీ తెచ్చి హుజురాబాద్ లో ఖర్చు చేసి ఈటలను ఓడించాలని చూస్తున్నారని, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈటలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి మనం బుద్ధి చెప్పాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ను గెలిపించి వారికి గుణపాఠం నేర్పాలని కోరారు. ప్రజలు గొర్రెలని.. పైసలిస్తే ఓటేస్తారని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. మన ఓట్లతో గెలిచి.. ఇంకా అవినీతి చేసి మరిన్ని డబ్బులు సంపాదించాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ లో చేసినంత అభివృద్ధి మిగతా చోట్ల ఎక్కడా జరగలేదన్నారు. చెక్ డ్యాంలు, ఫోర్ లైన్ రోడ్లు, వంద పడకల ఆస్పత్రి లాంటివి ఈటల రాజేందర్ కట్టించారని వివరించారు.  ఈటలకే ఓటేస్తామని ప్రజల మనస్సులో ఉందని, దాన్ని బయటకు తెప్పించి మనం ఓట్లేయించి కేసీఆర్ కు బుధ్ది చెప్పాలని కోరారు. 
 

Tagged Hanmakonda, Vivek Venkataswamy, Huzurabad, Vivek, ts bjp, telangana bjp, t bjp, , kamalapur mandal, vivek comments, telangana bjp updates, BJP updates, uppalapalli village

Latest Videos

Subscribe Now

More News