కన్నూర్ జిల్లాలో ఈరోజు ( జనవరి 26) జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో కేరళ మంత్రి కదనపల్లి రామచంద్రన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన ప్రసంగం ముగించిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దింతో వెంటనే ఆయన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
ఏం జరిగిందంటే.. కేరళ మంత్రి కదనపల్లి రామచంద్రన్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగాన్ని పూర్తి చేసిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లోకి ఎక్కించే సమయానికి ఆయన మళ్ళీ స్పృహలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు శివన్‌కుట్టి, జి.ఆర్. అనిల్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడి మంత్రులు జెండా ఎగురవేసి కార్యక్రమాలను నిర్వహించారు.
1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం ఒక స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా మారిన ఈ రోజును మనం ఏటా పండుగలా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందరో పోరాట యోధుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వేచ్ఛను, సమానత్వాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "వికసిత భారత్" నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఈ జాతీయ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆయన కోరారు.
