- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, వెలుగు: విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, విద్యాసంస్థలు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని ఖమ్మ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపడుతున్న చర్యలపై రవాణా శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రవాణా శాఖ హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ జి. సురేశ్ రెడ్డి, రవాణాశాఖ కమిషనరేట్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అఫ్రిన్ సిద్ధిఖీ కలిసి కలెక్టర్ కు రోడ్డు భద్రతా కార్యక్రమాలపై వివరాలు సమర్పించారు.
ఇటీవల పెనుబల్లిలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా రీ ఇన్స్పెక్షన్ చేయాలనే కలెక్టర్ ఆదేశాల మేరకు మొత్తం 764 విద్యాసంస్థల బస్సుల రీ ఇన్స్పెక్షన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సత్తుపల్లి యూనిట్ కార్యాలయం పరిధిలో 153 బస్సులకు గాను 146 బస్సుల రీ ఇన్స్పెక్షన్ పూర్తి చేశామని, వైరా యూనిట్ కార్యాలయం పరిధిలో 135 బస్సుల్లో 133 బస్సుల తనిఖీలు పూర్తి కాగా, ఒక బస్సు రిపేర్ల కారణంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఖమ్మం పరిధిలో 484 బస్సుల్లో 320 బస్సుల రీ ఇన్స్పెక్షన్ పూర్తయినట్లు, మిగిలిన 120 బస్సుల పరిశీలనను త్వరలో పూర్తిచేయనున్నట్లు చెప్పారు.
కొన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం, ఇంజిన్ సమస్యలు, వాహన వినియోగంలో లేనివిగా గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల భద్రత అత్యంత ముఖ్యమైనదని, విద్యాసంస్థల బస్సులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జగదీశ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం : రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కొటిక్ కంట్రోల్ కమిటీ, జిల్లా స్థాయి రహదారుల భద్రత కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసే సమయంలో కఠినమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో టాప్ 20 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. రామవరం సమీపంలోని నేషనల్ హైవేలో బ్లైండ్ కర్వ్, భద్రాచలం టెంపుల్ రోడ్డులో పాదచారుల భద్రత, కుక్కునూరు రోడ్డులో రహదారి పరిస్థితులపై డిస్కస్ చేశారు. అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రైల్వే క్రాసింగ్ వద్ద కనెక్టివిటి కోసం రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వెహికల్స్ ఆపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వెహికల్స్‌పై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రహదారులకిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించేందుకు అవసరమైన నివేదికలు అందించాలన్నారు. రోడ్డు యాక్సిడెంట్లు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. డ్రగ్స్, సారా తయారీపై నిఘా మరింత పెంచాలన్నారు.
బ్లడ్ డోనేషన్ క్యాంపులను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి తీసుకోవడంతో కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగుల పేర్లను ప్రతిపాదించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
