- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 30 జంక్షన్ ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గత 3 ఏండ్లలో 3,200 పైగా ప్రమాదాలు జరిగాయని, 30 జంక్షన్లలో 50 శాతం పైగా ప్రమాదాలు జరుగు తున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఆ జంక్షన్ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు రంబుల్ స్ట్రీప్స్, లేన్ మార్కింగ్, రాత్రి వేళల్లో సరిగ్గా కనిపించేందుకు ఏర్పాట్లు, ఆక్రమణల తొలగింపు, జీబ్రా క్రాసింగ్, సైన్ బోర్డ్స్, బ్లింకర్స్ ఏర్పాటు లాంటి చర్యలు 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ ఎం. అపూర్వ, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్, ఆర్ అండ్ బి, రవాణ, విద్యా శాఖ, నేషనల్ హైవే, మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మద్యం తాగి వెహికల్స్ నడపొద్దు
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దనే నినాదంతో ఖమ్మం సిటీలోని మిలినియం స్కూల్ విద్యార్థులతో కలిసి రవాణా శాఖ అధికారులు వాహన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వాహనదారులకు రోడ్డుపై పాంప్లెట్స్ అందజేశారు. రవాణా శాఖ ఆఫీస్ లో వాహనదారులకు అవగాహన కల్పించడంతో పరుగు వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, దినేశ్, రవిచందర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
యూరియా కోసం ఆందోళన వద్దు
చింతకాని : ఖమ్మం జిల్లాలో 13 వేల 795 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం చింతకాని మండలం నాగులవంచలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని, రైతులు అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి. పుల్లయ్య, జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్, మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ్ చంద్ర, చింతకాని తహసీల్దారు బాజ్జీ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
