ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్!

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్!
  • ఫస్టియర్​లో 71.15, సెకండ్​ ఇయర్​లో 77.68 శాతం పాస్
  • గతేడాది కంటే మెరుగైన ఫలితాలు 
  • ఖమ్మం జిల్లాకు ఫస్టియర్​ రిజల్ట్స్​లో మూడో స్థానం, సెకండ్​ ఇయర్​లో ఐదో స్థానం

ఖమ్మం, వెలుగు: ఇంటర్​ పరీక్షా ఫలితాల్లో మరోసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలే సాధించారు. ఫస్టియర్ లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉండగా, సెకండ్​ ఇయర్​లో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చినా ఈసారి మంచి ఫలితాలే వచ్చాయి. మొదటి సంవత్సరంలో 15,584 మంది పరీక్ష రాయగా, 11,088 మంది పాస్​ అయ్యారు. సెకండ్​ఇయర్​లో 14,876 మంది స్టూడెంట్స్​ పరీక్ష రాయగా, 11,557  మంది పాసయ్యారు. ఫస్టియర్​ ఫలితాల్లో 71.15 శాతం మంది పాస్​ కాగా, సెకండ్​ఇయర్​లో 77.68 శాతం మంది స్టూడెంట్స్​ పాస్​ అయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్​లో 2,253 మంది పరీక్ష రాయగా, 1,388 మంది పాస్​ అయ్యారు. సెకండియర్​లో 2,043 మంది పరీక్ష రాయగా, 1439 మంది పాస్​ అయ్యారు. 

భద్రాద్రికొత్తగూడెంలో..

భద్రాద్రికొత్తగూడెం: ఇంటర్​​ఫలితాల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్​​కాలేజీలు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించాయి. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. జిల్లాలోని నలంద, కృష్ణవేణి, సాహితి కాలేజీలకు చెందిన స్టూడెంట్స్​ రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. సెకండ్​ ఇయర్​లో 8,866 మంది స్టూడెంట్స్​ ఎగ్జామ్​ రాయగా 6,422 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,759 మంది బాయ్స్​కు 2,350 మంది, 5,107 మంది బాలికలకు 4,072 మంది పాస్​ అయ్యారు. 62.51శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించగా, 79.73శాతంతో బాలికలు పైచేయిగా నిలిచారు.

ఫస్ట్​ ఇయర్ లో 9,254 మంది స్టూడెంట్స్​ ఎగ్జామ్​ రాయగా, 5,779 మంది పాస్​ అయ్యారు. 3,888మంది బాలురకు 1,972 మంది పాస్​ అయ్యారు. 5,366 మంది బాలికలకు 3,807 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్​ ఇయర్​లో 70.94 శాతంతో బాలికలు సత్తా చాటారు. పాల్వంచ పోలీస్​స్టేషన్​లో హెడ్​ కానిస్టేబుల్​గా పని చేస్తున్న లిక్కి కోటేశ్వరరావు కొడుకు లిక్కి విశ్రుత్​ ఇంటర్​ సెకండ్​ ఇయర్ లో 994 మార్కులు సాధించి స్టేట్​లో ఫస్ట్​ ర్యాంకులో నిలిచాడు. అతడిని ఎస్పీ రోహిత్​ రాజును అభినందించారు. పాల్వంచకు చెందిన ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్ తోర్తి నవ్యశ్రీ ఎంపీసీలో 468 మార్కులు సాధించి సత్తా చాటింది. ములకలపల్లి మండలం కేజీబీవీ స్టూడెంట్​ పి.సౌమ్య 986 మార్కులు సాధించారు.