30 రోజుల్లో ఎగ్స్ సప్లై టెండర్ ఫైనల్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ

30 రోజుల్లో ఎగ్స్ సప్లై టెండర్ ఫైనల్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు:  జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు , అంగన్​వాడీ కేంద్రాలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా టెండర్ ను ఆగస్టు మొదటి వారం నాటికి ఫైనల్ చేయాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి గురువారం జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, అంగన్​వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరా టెండర్ ప్రక్రియ, శిథిలావస్థలో ఉన్న భవనాల మార్పు, కామన్ డైట్ మెనూ అమలు, తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మినహాయించి మిగిలిన సంక్షేమ హాస్టల్, కేజీబీవీ, అంగన్​వాడీ కేంద్రాలు, ఇతర విద్యా సంస్థలకు జిల్లా స్థాయిలోనే అవసరమైన కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కొనుగోలు కమిటీకి అధికారాలు అప్పజెప్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 

జిల్లా కొనుగోలు కమిటీలో విద్యాశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, గిరిజన సంక్షేమ అధికారి, రెసిడెన్షియల్ విద్యా సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్లు, పశుసంవర్ధక శాఖ అధికారి, ఆగ్ మార్క్ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కొత్త టెండర్లు ఫైనల్ అయ్యే వరకు ప్రస్తుత సరఫరా ప్రక్రియ బ్రేక్ కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో శిథిలావస్థ భవనాలలో ఉన్న హాస్టల్స్, అంగన్​వాడీ కేంద్రాలను త్వరగా షిప్ట్ చేయాలని సూచించారు. ప్రతీ బుధవారం జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తూ నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి ఎన్. విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్. పురందర్, సీఎంవో రాజశేఖర్, ఇన్​చార్జి బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.