మూడో టెస్టుకు వచ్చేస్తున్న విరాట్.. అమ్మ ఆరోగ్యం బాగుందంటూ వికాస్ కోహ్లీ క్లారిటీ

మూడో టెస్టుకు వచ్చేస్తున్న విరాట్.. అమ్మ ఆరోగ్యం బాగుందంటూ వికాస్ కోహ్లీ క్లారిటీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ తల్లి సరోజ్ లీవర్ సమస్యతో బాధపడుతున్నట్లు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య  పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో తరువాత జరగబోయే మూడు టెస్టులకు కోహ్లీ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.
 
మా అమ్మ ఆరోగ్యం బాగోలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యం బాగుంది. దయచేసి బయట ప్రజలు, మీడియాను నేను వేడుకుంటున్నాను. మా అమ్మ విషయంలో ఖచ్చితమైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దు.అని కోహ్లీ సోదరుడు వికాస్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో కోహ్లీ ఎందుకు బ్రేక్ తీసుకున్నాడనే  సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

మరోవైపు కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని.. మొదటి రెండు టెస్టులకు అతడు ఎందుకు తప్పుకున్నాడనే ఊహాగానాలు మానుకోవాలని బీసీసీఐ అభిమానులను, మీడియాను కోరింది. ఇదిలా ఉండగా కోహ్లీ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖాయమైంది. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత దాదాపు 10 రోజుల విరామం దొరుకుతుంది. ఈ లోపు కోహ్లీ జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోహ్లీ లేకుండా హైదరాబాద్ లో ఆడిన తొలి టెస్ట్ లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న వైజాగ్ లో జరుగుతుంది.