
- కనుమరుగైన కొత్తగూడెంలోని పలు పాత మున్సిపల్ వార్డులు
- ఆగస్టులో కార్పొరేషన్ ఎన్నికలు?
- 25 ఏండ్ల తర్వాత పాల్వంచలో ఎన్నికలు!
- ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ఆఫీసర్లు
- ఆందోళనలో ఆశావహులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ లో డివిజన్లు ఫైనల్ అయ్యాయి. పాల్వంచ–కొత్తగూడెం మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని మంగపేట, నర్సింహసాగర్, నాయకుల గూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, నిమ్మలగూడెం, కోమటిపల్లి గ్రామపంచాయతీలతో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రెండు నెలల కిందట గవర్నర్ గెజిట్ రిలీజ్ చేశారు. 60 డివిజన్లతో ఫైనల్ ముసాయిదాను ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
అంతా కొత్త కొత్తగా..
కొత్తగా కార్పొరేషన్ ఏర్పడగా కొత్తగూడెం పరిధిలో 29, పాల్వంచ పరిధిలో 27, సుజాతానగర్ మండలంలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేశారు. డివిజన్ల ఏర్పాటుతో గతంలో వార్డులుగా ఉన్న హద్దులు పూర్తిగా మారాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న పలు వార్డులు చిన్నాభిన్నమయ్యాయి. కాగా, గతంలో ఒక్కో మున్సిపల్ వార్డులో వెయ్యి నుంచి 1500 వరకు ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం ఏర్పడిన కార్పొరేషన్లో ఒక్కో డివిజన్లో 2,220 నుంచి 2,500 వరకు ఓటర్లున్నారు. వార్డుల హద్దులతో కొన్ని చోట్ల బస్తీల్లోనూ మార్పులు
చేసుకున్నాయి.
గందరగోళంగా...
డివిజన్ల ఏర్పాటులో రాజకీయాలు చోటు చేసుకున్నాయని పలువురు మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కొందరు రాజకీయ నేతలతో కుమ్మక్కైన కార్పొరేషన్ అధికారులు వారు చెప్పినట్టుగా డివిజన్లను చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేదరబస్తీ, కూలీ లైన్, చమన్ బస్తీతో పాటు పలు మున్సిపల్ పాత వార్డులు నామ రూపాలు లేకుండా పోయాయని పలువురు మాజీ కౌన్సిలర్లు ఆఫీసర్ల తీరుపై మండి పడుతున్నారు. అధికారంలో ఉన్న కొందరు తమకు వ్యతిరేకంగా ఉన్న పాత మున్సిపల్ వార్డులతో పాటు ఆయా నేతలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో వార్డులను విభజన చేశారంటూ పలువురు
ఆరోపిస్తున్నారు.
హైకోర్టు బాటలో...
కొత్తగూడెం కార్పొరేషన్లలో ఏర్పడిన డివిజన్ల ఏర్పాటుతో పాటు ఏజెన్సీ చట్టాలు అమలవుతున్న పాల్వంచ పట్టణాన్ని కార్పొరేషన్లో ఎలా విలీనం చేస్తారంటూ పలువురు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా డివిజన్ల ఏర్పాటులో జరిగిన గందరగోళంపై పలువురు మాజీ కౌన్సిలర్లు హైకోర్టు మెట్లెక్కనున్నారు.
ఆశలు ఆవిరైన వేళ..
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడెం పట్టణంలోని పలువురు మాజీ కౌన్సిలర్ల ఆశలు ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెంలోని 14, 18, 21, 24, 26, 27, 33,34, 36 పాత మున్సిపల్ వార్డులు కొత్త డివిజన్లతో పూర్తిగా మారిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో తమకు పట్టున్న వార్డులు డివిజన్ల నేపథ్యంలో అటు ఇటుగా మారడంతో తమకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పలువురు ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోప్యంగా...
కొత్తగూడెం కార్పొరేషన్లో డివిజన్లకు సంబంధించి ఫైనల్ ముసాయిదాను ప్రభుత్వం రిలీజ్ చేసినట్టుగా ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రకటించి వారం దాటుతున్న స్థానిక కార్పొరేషన్ ఆఫీసర్లు మాత్రం వివరాలను బహిర్గతం చేయడం లేదంటూ బీజేపీ, సీపీఎం పార్టీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
వచ్చే నెలలో ఎన్నికలు?
రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లోనూ ఆ దిశగా ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఏజెన్సీ, గిరిజన చట్టాల నేపథ్యంలో గత 25 ఏండ్లుగా ఎన్నికలకు నోచుకోని పాల్వంచ పట్టణ ప్రజలు కార్పొరేషన్ ఏర్పాటుతో ఎన్నికల్లో పాల్గొననున్నారు.