కృష్ణా బోర్డు మీటింగ్ నేడు

కృష్ణా బోర్డు మీటింగ్ నేడు

కృష్ణా బోర్డు మీటింగ్‌ బుధవారం జరగనుంది. సాయంత్రం కృష్ణా, గోదావరి బోర్డుల జాయింట్​ మీటింగ్​ కూడా నిర్వహించనున్నారు. జ్యూరిస్‌ డిక్షన్‌ అమలుపై అందులో చర్చ జరగనుంది. గతంలో జ్యూరిస్‌ డిక్షన్‌ అమలు కోసం నిర్వహించిన కోఆర్డినేషన్‌, జాయింట్‌ మీటింగ్‌లకు డుమ్మా కొట్టిన మన రాష్ట్రం.. ఈసారి హాజరై, ఏం చెప్తుందనేది ఆసక్తిగా మారింది. 

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నీళ్లపై తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న ఒక్క వివాదానికైనా బోర్డు మీటింగ్‌‌లో పరిష్కారం దొరుకుతుందా? రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీలుగా ఉన్న నీళ్ల పంపకాలు, కరెంట్‌‌ ఉత్పత్తిపై ఏదైనా నిర్ణయం తీసుకునే చాన్స్‌‌ ఉందా? మిగతా సమస్యలపైనా ఏమైనా తేల్చుతారా? లేక గత సమావేశాల్లో మాదిరే చేతులెత్తేస్తారా?... ఈ ప్రశ్నలన్నింటికీ బుధవారం సమాధానం దొరకనుంది. హైదరాబాద్​లోని జలసౌధలో ఉదయం కృష్ణా బోర్డు, సాయంత్రం కృష్ణా, గోదావరి బోర్డుల జాయింట్‌‌ మీటింగ్‌‌ జరగనుంది. బోర్డుల జ్యూరిస్‌‌ డిక్షన్‌‌ అమలుపై జాయింట్ మీటింగ్​లో చర్చ జరగనుంది. గతంలో జ్యూరిస్‌‌ డిక్షన్‌‌ అమలుకు నిర్వహించిన కోఆర్డినేషన్‌‌, జాయింట్‌‌ మీటింగ్‌‌లకు డుమ్మా కొట్టిన మన రాష్ట్రం.. ఈసారి హాజరై, ఏం చెప్తుందనేది ఆసక్తిగా మారింది. 
ఇవీ ఎజెండాలు... 
కేఆర్‌‌ఎంబీ 14వ, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) 11వ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇప్పటికే ఖరారు చేశారు. గోదావరి బోర్డు ఎజెండాలో జ్యూరిస్‌‌ డిక్షన్‌‌ గెజిట్‌‌లోని క్లాజుల అమలు మాత్రమే చేర్చారు. కృష్ణా బోర్డు ఎజెండాలో నీటి పంపకాలు, జల విద్యుత్‌‌ ఉత్పత్తి, క్యారీ ఓవర్‌‌, ప్రాజెక్టులు సర్‌‌ప్లస్‌‌ అయ్యే రోజుల్లో నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు, అనుమతులు, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ నీటి వినియోగం, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీటిలో తెలంగాణ వాటా, కేఆర్‌‌ఎంబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ షిఫ్టింగ్‌‌, జ్యూరిస్‌‌ డిక్షన్‌‌, బోర్డుకు 2 రాష్ట్రాల నుంచి రావాల్సిన బకాయిలను చేర్చారు. గత సమావేశాల్లోనూ ఇవే అంశాలపై చర్చించినా.. ఒక్క దానికీ పరిష్కారం చూపలేదు. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ ను ఏపీ స్వాగతించగా, మన రాష్ట్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమావేశంతో మన సర్కార్ స్టాండ్‌‌ తేలిపోనుంది.