అధికారంలోకి వస్తే మళ్లీ ఆ తప్పులు చేయం : కేటీఆర్

అధికారంలోకి వస్తే మళ్లీ ఆ తప్పులు చేయం : కేటీఆర్
  • పార్టీ కేడర్​ను కండ్లలో పెట్టుకుని చూస్కుంటం: కేటీఆర్
  • రేషన్ కార్డులివ్వడం గొప్ప కాదు.. ప్రభుత్వ బాధ్యత
  • స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్​కు ప్రీ ఫైనల్
  • కాంగ్రెస్ మోసాలు ప్రజలకు వివరించాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు.. మళ్లీ పవర్​లోకి వచ్చాక చేయమని తెలిపారు. అటు ప్రభుత్వాన్ని.. ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూస్కుంటామని చెప్పారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు బుధవారం బీఆర్ఎస్​లో చేరారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రీ ఫైనల్ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, మెజార్టీ స్థానాలు గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని తెలిపారు. ఓ తండ్రిలా ప్రజలను కేసీఆర్​ కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పారు. చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను చూడాలని అన్నారు. రాష్ట్రంలో గుర్రాలెవరో.. గాడిదలెవరో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే.. కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్​రైట్ అవుతారు’’అని కేటీఆర్ అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి.. ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసింది. 

రేషన్ కార్డులు ఇచ్చి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టుకుంటున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప కాదు. అది ప్రభుత్వ బాధ్యత. పింఛన్​ తీసుకునే ఒక్కో పెద్దాయనకు రేవంత్ రెడ్డి రూ.40 వేల దాకా బాకీ ఉన్నారు. ప్రతీ ఆడబిడ్డకు రూ.50 వేలు బాకీ పడ్డారు’’అని కేటీఆర్ అన్నారు. కాగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి వ్యతిరేకంగా పోలీసులను రాజకీయ ఆయుధంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్​వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఇంట్లో.. విద్యార్థి విభాగం నేతలతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం చెల్లదని తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు.