వెంకటాపూర్ (రామప్ప) వెలుగు: ములుగు జిల్లాలో మూడు రోజులుగా పెద్దపులి సంచారిస్తూ జనాలను, ఆఫీసర్లను హడలెత్తిస్తోంది. పొరుగు జిల్లా మహబూబాద్అటవీ ప్రాంతం నుంచి ములుగు మండలం పత్తిపల్లి శివారులోకి వచ్చింది. పంట పొలాల్లో కనిపించిన పులి వెంకటాపూర్మండలంలోకి అడుగుపెట్టింది. దీంతో కేశవాపూర్, నర్సాపూర్ గ్రామాల రైతులు పులి కదలికల గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే గ్రామానికి వెళ్లి వచ్చి పులి పాదముద్రలను గుర్తించినట్టు రేంజ్అధికారి డోలి శంకర్తెలిపారు. పాపయ్యపల్లి, సింగర గుంటపల్లి నుంచి పాలంపేటకు చేరుకున్నట్లు, పులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట బయటకు రావొద్దని సూచించారు. కాగా.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వచ్చే టూరిస్టులు పులి సమాచారం తెలుసుకుని భయాందోళన చెందారు.
పాలంపేట గుట్టలు, రామప్ప చెరువు శివారు అటవీ ప్రాంతాల్లో ఎక్కడ ఉందో తెలియక రైతులు పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ములుగు జిల్లా మీదుగా కొత్తగూడ అటవీ ప్రాంతానికి వెళ్తుందా..? లేక రామంజాపూర్ శివారు నుంచి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్తుందా..? అని అటవీ అధికారులు అనుమానిస్తూ పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
