పూర్ణ స్వరాజ్​ గుర్తుగా సంవిధాన్​ దివాస్

పూర్ణ స్వరాజ్​ గుర్తుగా సంవిధాన్​ దివాస్

గత 72ఏండ్లుగా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజునే భారత రాజ్యాంగం అమలులోకి రావడం ఇందుకు కారణం. వాస్తవానికి 1949, నవంబర్​ 26న రాజ్యాంగ నమూనాను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. ఈ రోజుకు ప్రత్యేకతను గుర్తించడం కోసం 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగంపై అవలోకనం.

భారత రాజ్యాంగ రచన 1946 డిసెంబర్ 9న మొదలై 1950 జనవరి 24న ముగిసింది. ఇందుకు రెండేండ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రూ.64లక్షలు ఖర్చయింది. అయితే 1949, నవంబర్​ 26కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజునే బి.ఆర్​. అంబేద్కర్​ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగ నమూనాను ఎన్నో వాదనలు, ప్రతివాదనలు, సవరణల తర్వాత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. కానీ భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఇందుకు ప్రత్యేక కారణమూ ఉంది. 1929 లాహోర్​ కాంగ్రెస్ సమావేశం తీర్మానం మేరకు 1930 జనవరి 26ను పూర్ణ స్వరాజ్​గా పాటించారు. ఆ రోజుకు ప్రత్యేకత తీసుకురావడం కోసం భారత రాజ్యాంగ  అమలు తేదీగా ప్రకటించారు.  2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన  ఎన్​డీఏ ప్రభుత్వం ‘నవంబర్​ 26’ ప్రత్యేకతను చాటిచెప్పాలని భావించింది. ఈ రోజును 2015 నుంచి ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’ లేదా ‘సంవిధాన్​ దివాస్’ లేదా జాతీయ చట్ట దినంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. 

అతిపెద్ద లిఖిత రాజ్యాంగం

ఆధునిక రాజ్యాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో పరిపాలన అనేది పూర్తిగా రాజ్యాంగం పరిధిలో జరుగుతుంది. రాజ్యాంగం అంటే దేశాన్ని పాలించడానికి కావాల్సిన రాజకీయ సూత్రాలు, వాటి అమలుకు కార్యనిర్వాహక వ్యవస్థ, వాటి పరిరక్షణకు న్యాయ వ్యవస్థను కలిగి ఉండటం. భారత రాజ్యాంగం చాలా నిర్దిష్టమైన విస్తృతిని కలిగి ప్రపంచంలోనే పెద్దదైన ‘రాత రాజ్యాంగం’ ఖ్యాతికెక్కింది. అంతేకాకుండా రాజ్యాంగం అనేది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రతీక. మన రాజ్యాంగం భారతీయ సమ్మిళిత సంస్కృతులను తనలో ఇముడ్చుకొని అలాంటి ఉత్కృష్టమైన సజీవ సంస్కృతిని మరింత సజీవమైనదిగా మార్చే ఒక సజీవ పత్రం. అందుకే భారత రాజ్యాంగాన్ని  కొందరు సజీవ పత్రంగా వర్ణించారు.  

60 రాజ్యాంగాల స్ఫూర్తితో.. 

భారత రాజ్యాంగం ప్రపంచంలోని ముఖ్యమైన రాజ్యాంగాలను కొల్లగొట్టి, రూపొందించారని కొందరు పాశ్చాత్య రాజ్యాంగ నిపుణులు విమర్శించారు. ఇది భారత రాజ్యాంగ పరిషత్తు, బి.ఆర్.అంబేద్కర్​ను తక్కువ చేసి చెప్పడమే. ఇది సత్య దూరం కూడా. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, చరిత్రలపై అవగాహన లేకపోవడం లేదా ప్రపంచంలోనే ఘనమైన రాజ్యాంగాన్ని చూసి ఓర్వలేని తనంతోనే అలా వర్ణించి ఉండవచ్చు. అసలు వాస్తవం ఏమిటంటే భారత రాజ్యాంగ రచయితలు అప్పటికే ప్రపంచంలో మనుగడలో ఉండి పేరు మోసిన మంచి అనుభవం గడించిన 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని తమ మేధస్సుతో భారత రాజ్యాంగాన్ని  దేశ చారిత్రక సాంస్కృతిక స్ఫూర్తితో రూపొందించారు. అందుకే బి.ఆర్.అంబేద్కర్​ ఆధునిక మనువు లేదా నవ భారత రాజ్యాంగ నిర్మాతగా ఖ్యాతికెక్కారు. అప్పటికే వందల ఏళ్లుగా చలామణిలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాల అనుభవసారాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన రాజ్యాంగం కొత్త సమస్యలు, ఆపదలను తట్టుకొని నిలబడేలా భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా రూపుదిద్దుకోగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం అవిచ్ఛినంగా కొనసాగుతూ తన ఛత్రం కింద ఉన్న మహోన్నత దేశాన్ని, సంస్కృతిని పురోభివృద్ధి వైపు నడిపిస్తోంది. తన 72 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అత్యవసర పరిస్థితి, సంకీర్ణ రాజకీయ అనిశ్చితులు, రాజకీయ సంక్షోభాలు, మహా ఆర్థిక సంక్షోభాలు, బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్​ మతకలహాలు తదితర మత మౌఢ్య  మహోత్పాతాలను , చైనా– పాకిస్తాన్​లతో యుద్ధాలు, కరువు కాటకాలను, నక్సలిజం వంటి విప్లవోద్యమాలను దాటి ఈ దేశాన్ని తన లక్ష్యాలకు అనుగుణంగా తీసుకుపోవడం భారత స్ఫూర్తి, అంతర్గత శక్తి సామర్థ్యాలను తేటతెల్లం చేస్తుంది. 

పీఠికలో రాజ్యాంగ లక్ష్యాలు

భారత రాజ్యాంగ పీఠికలో భారత్​ను సర్వ సత్తాక, సోషలిస్టు, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించింది. రాజ్యాంగ లక్ష్యాలను కూడా వివరించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం లేదా శ్రేయో రాజ్య స్థాపనే తన లక్ష్యంగా చెప్పబడింది. దీన్ని సాధించుకోవడానికి కావాల్సిన రాజ్యాంగ  వ్యవస్థను శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను సంగ్రహంగా వివరించి చెప్పబడింది.  ఆసేతు హిమాచల పర్యంతం భారతదేశం భౌగోళికంగా ఉపఖండంగా ప్రసిద్ధి. దీంతోపాటు జాతి, మత, భాషా, సంస్కృతి, కళలు, సామాజిక, శీతోష్ణస్థితి, ఆహార పానీయాలు, వేషధారణ లాంటి ఎన్నో విషయాల్లో చెప్పలేనంత భిన్నత్వాన్ని కలిగి ఉంది. భారత రాజ్యాంగం ఆధునిక భారతానికి ఏకత్వాన్ని ప్రసాదించి భిన్నత్వాన్ని సంరక్షిస్తుంది.ఇది భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్​(భాషా భిన్నత్వం), ఏడో షెడ్యూల్ (సమైక్య రాజ్యం), అందరికీ సమానత్వాన్ని స్వేచ్ఛను ప్రసాదించే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికలు, 74, 75వ రాజ్యాంగ సవరణ చట్టాలు, షెడ్యూల్డ్​ తెగలకు ప్రత్యేక నిబంధనలు, రిజర్వేషన్లు మొదలైనవి. 
గత 72 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య జరిగిన సంవాదం రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో విఫలమే అని చెప్పవచ్చు. ఇందుకు న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ద్వారా కేశవానంద భారతి–1973 తీర్పుతో చరమ గీతం పాడింది. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం లేకుండా పార్లమెంట్​ రాజ్యాంగంలోని ఏ భాగమైనా సవరించుకోవచ్చు. దీంతో భారత పార్లమెంట్​కు సుప్రీంకోర్టుకు లేదా ప్రాథమిక హక్కులకు, ఆదేశ సూత్రాలకు మధ్య జరిగిన దశాబ్దాల వివాదం రాజ్యాంగ స్ఫూర్తిని మేలు కొలుపుతూ సమసింది. ఇదేవిధంగా 1989లో మొదలై 2014 వరకు 25 సంవత్సరాలపాటు కొనసాగిన సంకీర్ణ రాజకీయ అనిశ్చితి కాలం రాజ్యాంగానికి పెద్ద పరీక్షనే పెట్టింది. దీన్ని రాజ్యాంగం విజయవంతంగా సమైక్య భావనతో అధిగమించింది.

బాధ్యతలు తెలుసుకోవాలి

రాజ్యాంగం తన లక్ష్యాలుగా ప్రకటించు కున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం లేదా శ్రేయోరాజ్య స్థాపన ఇంకా చాలా దూరంలో ఉంది. వలస పాలన నుంచి మనం వారసత్వంగా పొందిన దుర్భర దారిద్ర్యం, వెనకబాటు తనం, అసమానతలు, మత మౌఢ్యం ఇంకా మనుగడ సాగిస్తున్నాయి. వీటితోపాటు కింది స్థాయిలో ప్రజాస్వామ్యం లేకపోవడం, పార్టీల ఫిరాయింపులు, నక్సలిజం, దోపిడీలు ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నించే స్థాయిలో ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు ప్రతి ఒక్కరు హక్కులతోపాటు బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తిస్తేనే పై సమస్యలను అధిగమించి భారత్​ను అగ్రరాజ్యంగా పునరుజ్జీవంపజేయగలం. భారత్​ను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో జీవించడానికి ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు సంకల్పం తీసుకోవాలి. అదే రాజ్యాంగానికి, భారతదేశానికి మనం చేసే మహోన్నత సేవ.

ప్రక్షాళన అవసరమా?

72 సంవత్సరాల సుదీర్ఘ  రాజ్యాంగ చరిత్రలో ఎన్నో లోపాలను విశ్లేషకులే కాదు సామాన్యులు సైతం ఎత్తిచూపేలా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్​ పాత్ర, సమైక్య భావన వివాదం, అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక శక్తుల విజృంభణ, మతతత్వ రాజకీయాలు, నేరమయ రాజకీయాలు, ఎన్నికల్లో ధన కండబలం, అందరికీ ప్రాతినిధ్యం లేకపోవడం, రాజకీయ అవినీతి, ఆర్థిక కుంభకోణాలు, ఫిరాయింపులు మొదలైనవి. వీటి వల్ల రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అందువల్లనే రాజ్యాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం లేదా పునర్​ రచించడం ఒక్కటే పరిష్కారమనే డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 100కు పైగా రాజ్యాంగ సవరణలను వీరు దీనికి ఆధారంగా చూపుతున్నారు. రాజ్యాంగం కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలను అధిగమించడంలో విఫలమైందని వీరి వాదన.  ఈ విషయాన్ని పరిశీలించే ముందు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ రాజ్యాంగ పరిషత్తులో. ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారు చెడ్డ వారైతే అదీ చెడ్డదవుతుంది’ అని చెప్పారు. దీన్ని బట్టి భారత పాలనా వ్యవస్థలో లోటుపాట్లు భారత రాజ్యాంగంలోని లోటుపాట్లు కావు. వాస్తవంగా అవి రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థ, వ్యక్తుల వల్లే సంభవించాయి. రాజ్యాంగ వ్యవస్థను, --- రాజ్యాంగాన్ని తప్పుపట్టడం మాని దాన్ని అమలు చేసే యంత్రాంగాల ప్రక్షాళనపై దృష్టి పెట్టడానికి ఈ రాజ్యాంగ దినోత్సవం సంకల్పించడం ఎంతయినా అవసరం. 

-ఎం. గంగాధర్​ రావు పరివర్తన్​ ఇండియా ఐఏఎస్