పోతే రూ.3 లక్షలు.. వస్తే వాటా గ్రూపులుగా ఏర్పడి వైన్స్లకు టెండర్లు

పోతే రూ.3 లక్షలు.. వస్తే వాటా  గ్రూపులుగా ఏర్పడి వైన్స్లకు టెండర్లు
  • మద్యం వ్యాపారుల ఒప్పందం
  • సరిహద్దు షాపులకు డిమాండ్
  • ఈనెల 18 వరకు దరఖాస్తులకు అవకాశం

ఆసిఫాబాద్, వెలుగు: మద్యం దుకాణాలకు నూతన లైసెన్సుల కోసం ఆశావహులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్​గా మారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. లక్కీ డ్రాలో పాల్గొనాలంటే రూ.3 లక్షల డీడీ చెల్లించాలి. డ్రాలో షాప్ ​దక్కకపోతే ఈ అమౌంట్ ​తిరిగి రాదు. ఇంత డబ్బు ఒక్కరే కట్టి లక్కు కుదరకపోతే నష్టం జరుగుతుందని భావిస్తున్న ఆశావహులు గ్రూపులుగా ఏర్పడి టెండర్లు వేస్తున్నారు. 

ఒక్కో గ్రూపులో 5 నుంచి 20 మంది వరకు ఉంటున్నారు. రూ.3 లక్షలు జమచేసి ఒక్కరి పేరుపై టెండర్ దాఖలు చేస్తున్నారు. పోతే రూ.3లక్షలు, లక్కు కుదిరితే పంట పండినట్లేనని భావిస్తున్నారు. కొందరు ఒక్క వైన్స్​కే పరిమితం కాకుండా పలు షాపులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఒక చోట కాకపోతే మరో చోట కలిసివస్తుందనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 

పెరగనున్న దరఖాస్తులు

మద్యం దుకాణాల టెండర్లకు గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కొత్త పాలసీతో పాటు, రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఆయా వర్గాల వారు దరఖాస్తులు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలోని  32 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 18 వరకు అవకాశం ఉంది. గడువు సమీపిస్తుండటంతో దరఖాస్తులు ఊపందుకోనున్నాయి.

గుడ్ విల్ కోసం

మద్యం దుకాణాల టెండర్​ఎలాగైనా దక్కించుకోవాలని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు. కొందరితో కలిసి సిండికేట్​గా ఏర్పడుతున్నారు. వారి పేరుపైనే షాపు దక్కితే ఒకే.. రాకపోయినా షాప్​ను మాత్రం వదిలేది లేదని భావిస్తున్నారు. లక్కీ డ్రాలో ఎవరికి షాప్ దక్కినా నిర్వహణ మాత్రం తామే చేపట్టేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వైన్స్​ల నిర్వహణలో పెద్దగా అనుభవం లేని వారికి లక్కీ డ్రా దక్కితే అప్పటికప్పుడే వారికి గుడ్ విల్ ఇచ్చి షాప్​ను హ్యాండోవర్​ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

గూడెం వైన్స్​కు మస్త్ కాంపిటీషన్

కాగజ్ నగర్ డివిజన్ లోని చింతల మానేపల్లి మండలం గూడెం వైన్స్​కు మస్త్ కాంపిటీషన్ ఉంటోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలికి సమీపంలో ఉండడం.. ఆ జిల్లాలో మద్య నిషేధం అమల్లో ఉండడంతో ఆ ప్రాంతం వారు సైతం మద్యం కోసం గూడెం వైన్స్​కు వస్తుంటారు. దీంతో ఈ షాప్​వద్ద నిత్యం మద్యంబాబుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతుండడంతో దీన్ని దక్కించుకునేందుకు చాలా మంది దరఖాస్తులు వేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.