ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్

ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్
  • ఈ నెల 17న ఓట్ల లెక్కింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5వరకు క్యూలైన్ లో నిలుచున్న వారికి ఆలస్యమైనా ఓటు వేసే అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఎన్నికలను ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా పరిగణించి పోటా పోటీగా ఓటింగ్ కు ప్రయత్నించడం.. పలుచోట్ల దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో పరస్పరం వాగ్వాదాలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. 
అలాగే నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు, పలు నగర పంచాయతీలకు జరిగిన  పోలింగ్ సందర్భంగా వాగ్వాదాలు, దొంగ ఓట్లు వేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే పరస్పర ఆరోపణలతో  ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. అలాగే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలోని సొంత నియోజకవర్గం, సొంతూరు బేతంచెర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు జరిగిన ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా పరిగణించడం ఉత్కంఠ రేపింది. ఈ నేపధ్యంలో బేతంచెర్లతోపాటు నందికొట్కూరు మున్సిపాలిటీలో ఉద్రిక్తతను నివారించేందుకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ముగిసింది. అలాగే గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, అనంతపురం జిల్లా పెనుకొండ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.