మున్సిపోల్స్పైనేతల గురి !.. పాగా వేసేందుకు కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ నేతల వ్యూహాలు

మున్సిపోల్స్పైనేతల గురి !.. పాగా వేసేందుకు కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ నేతల వ్యూహాలు
  • ఇందూర్‌‌‌‌, బోధన్‌‌‌‌పై మజ్లిస్‌‌‌‌ నజర్‌‌‌‌
  • ఉనికి చాటుకునేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కసరత్తు 

నిజామాబాద్‌‌‌‌, వెలుగు : మున్సిపల్‌‌‌‌ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా తయారీలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. దీంతో జిల్లాలో ముందస్తుగానే రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పురపోరులోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేలా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు వేగంగా సాగేలా చూస్తోంది. పురపోరులో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేసింది. ఇందూర్‌‌‌‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌‌‌‌ మున్సిపాలిటీపై మజ్లిస్‌‌‌‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో సాధించిన స్థానాల కంటే ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాత్రం తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ విడుదలయ్యే వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉంది. వార్డు, డివిజన్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌లు ఖరారైన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ, మజ్లిస్​లు కసరత్తు చేస్తున్నాయి.  

కార్పొరేషన్‌‌‌‌ దక్కించుకునేలా.. 

ఇందూర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌గా మారిన తర్వాత ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌‌‌‌, రెండుసార్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితులు మారాయి. కాంగ్రెస్‌‌‌‌కు కలిసొచ్చేలా ఉండటంతో ఈసారి కార్పొరేషన్‌‌‌‌లో పట్టు సాధించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్​గౌడ్‌‌‌‌ సొంత జిల్లా కేంద్రంలో జరిగే కార్పొరేషన్‌‌‌‌ ఎన్నికలను కాంగ్రెస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వం గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది.

రిజర్వేషన్‌‌‌‌లు స్పష్టమైన వెంటనే అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌‌‌‌ అలీ, సుదర్శన్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో కేడర్‌‌‌‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. 60 డివిజన్లు ఉన్న నగర పాలక సంస్థలో గత ఎన్నికల్లో 28 కార్పొరేటర్లను గెలుచుకుని స్వల్ప తేడాతో మేయర్‌‌‌‌ పదవిని కోల్పోయిన బీజేపీ, ఈసారి ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఇప్పటికే సర్వేలు నిర్వహించింది. గత ఎన్నికల్లో 16 కార్పొరేటర్లను గెలుచుకుని డిప్యూటీ మేయర్‌‌‌‌ పదవిని దక్కించుకున్న మజ్లిస్‌‌‌‌ కూడా ఈసారి పక్కా ప్లాన్​తో సత్తా చాటాలని చూస్తోంది.  

మూడు మున్సిపాలిటీలపై పోటీ 

ఐదేళ్ల కిందటి రిజర్వేషన్‌‌‌‌లే ఈసారి కూడా అమలవుతాయనే అంచనాతో బోధన్‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌, భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నేతలు గ్రౌండ్‌‌‌‌వర్క్‌‌‌‌ మొదలుపెట్టారు. కాంగ్రెస్‌‌‌‌ ఆశావహులు ఇప్పటికే తమ ఆసక్తిని ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లగా, రిజర్వేషన్‌‌‌‌లు మారితే అవకాశం తమదేనని భావిస్తున్నవారు కూడా ఉన్నారు. కార్పొరేషన్‌‌‌‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో గెలుపును కాంగ్రెస్‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌గా తీసుకోగా, బోధన్‌‌‌‌పై మజ్లిస్‌‌‌‌ ప్రధానంగా ఫోకస్‌‌‌‌ పెట్టింది. ఆర్మూర్‌‌‌‌ పురసంఘం ఎన్నికలను ఎమ్మెల్యే పైడి రాకేశ్‌‌‌‌రెడ్డి సవాల్‌‌‌‌గా భావిస్తున్నారు. బాల్కొండ సెగ్మెంట్‌‌‌‌ పరిధిలోని భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీ ఎన్నికలను స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌‌‌‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ శ్రేణులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.