
- రెండేండ్లుగా అక్కడ జనం ఇబ్బందులు పడుతున్నా పట్టదా?
న్యూఢిల్లీ: రెండేండ్లుగా మణిపూర్ అల్లర్లు, సమస్యలతో సతమతమవుతున్నా ప్రధాని నరేంద్రమోదీ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు, సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎందుకు ఫెయిల్ అయిందని శనివారం ఆయన ట్వీట్ చేశారు. 2023 మే నుంచి మణిపూర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని.. రెండు రోజుల కింద కూడా అల్లర్లలో 25 మంది గాయపడ్డారని తెలిపారు. రెండేండ్ల నుంచి జరుగుతున్న హింస కారణంగా ఇప్పటి వరకు 260 మంది చనిపోగా, 68 వేల మంది రాష్ట్రాన్ని వదలి వెళ్లపోయారని, వేలాది మంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
2022 జనవరిలో మణిపూర్లో మీరు చివరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీరు 44 ఫారిన్ టూర్లు, 250 దేశీయ పర్యటనలు చేపట్టారు. కనీసం ఒక్క సెకండ్ కూడా మణిపూర్లో గడపలేదు. ఆ రాష్ట్రంపై ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత కోపం? ఇదేనా మీ నిబద్ధత? ఇదేనా రాజధర్మం?” అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. అర్ధరాత్రి 2 గంట తర్వాత హడావుడిగా ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన తీర్మానం చేసిందని, అసమర్థతనను కప్పించుకునేందుకు ఇట్ల చేశారని ఆయన దుయ్యబట్టారు.