నస్పూర్‌‌లో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్‌‌లో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: వేసవిలో విద్యతో పాటు కళలు, ఆర్ట్, పెయింటింగ్ తో పాటు యోగా శిక్షణ అందించేందుకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో డీఈవో ఎస్.యాదయ్య తో కలిసి ఎంఈవోలు, స్కూళ్ల హెచ్ఎంలతో వేసవి శిక్షణ శిబిరం నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లాలోని 50 స్కూళ్లు సిద్ధంగా ఉన్నాయని, 15 రోజుల పాటు శిబిరాలు నిర్వహించాలన్నారు. ఒక్కో శిబిరానికి రూ.50 వేల నిధులు అందిస్తామని తెలిపారు. ప్రతి శిబిరంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ అందించాలని, టీచర్లు, వలంటీర్ల ద్వారా గ్రామ పంచాయతీల వారీగా శిబిరాలు నిర్వహించాలన్నారు.

ధాన్యాన్ని త్వరగా అన్​లోడ్ చేసుకోవాలి

దండేపల్లి, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయాలని కలెక్టర్ ​సూచించారు. దండేపల్లి మండలం ముత్యంపేట, నెల్కి వెంకటాపూర్, దండేపల్లి, వెల్గనూరు, పాత మామిడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ధర్మరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు, కన్నేపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్​ను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. 

ధాన్యం అమ్మేందుకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లను సమకూరుస్తామని చెప్పారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్ల కేటాయిస్తామని స్పష్టం చేశారు. జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ సంధ్యారాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జేఆర్ ప్రసాద్, ఆర్ఐ భూమన్న, ఏపీఎం భూపతి బ్రహ్మం, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.