ఢిల్లీలో 2 వేల కోట్ల స్కామ్ .. ఆప్‌‌ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌‌లపై ఏసీబీ కేసు

ఢిల్లీలో 2 వేల కోట్ల స్కామ్ .. ఆప్‌‌ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌‌లపై ఏసీబీ కేసు
  • ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌‌లపై మరో కొత్త కేసు నమోదైంది. ఆప్‌‌ ప్రభుత్వ హయాంలో.. ఢిల్లీలో జరిగిన12 వేల తరగతి గదులు, స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణాల్లో రూ.2 వేల కోట్ల విలువైన అవినీతి జరిగినట్లు తేలింది. ఈ అవినీతిలో మనీశ్‌‌ సిసోడియా, జైన్‌‌లది కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు.. ఈ మేరకు సిసోడియా, జైన్‌‌లపై 'క్లాస్ రూమ్ కన్‌‌స్ట్రక్షన్ స్కామ్' పేరుతో కేసు బుక్‌‌ చేశారు. 

ఈ స్కామ్‌‌లో పలువురు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. గత ఆప్‌‌ ప్రభుత్వంలో సిసోడియా ఎడ్యుకేషన్ మినిస్టర్​గా పనిచేయగా.. సత్యేంద్ర జైన్ పబ్లిక్ వర్క్స్  డిపార్ట్‌‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రిగా  బాధ్యతలు నిర్వర్తించారు. ఆ టైంలోనే ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాలను నిర్మించారు. అయితే, వాటిని నిర్ణయించినదాని కంటే అధిక వ్యయంతో నిర్మించినట్లు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. వీటి నిర్మాణంలో రూ.2 వేల కోట్లు అక్రమాలు జరిగాయని దర్యాప్తు చేసి ప్రకటించారు.

ఆప్‌‌ సంబంధీకులకే కాంట్రాక్టులు

క్లాస్ రూమ్ కన్​స్ట్రక్షన్ పనులను మొత్తం 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని.. అందులో ఎక్కువ మంది ఆప్‌‌తో సంబంధాలు కలిగిన కాంట్రాక్టర్లే ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. నిర్ణీత గడువులోపు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఖర్చులు భారీగా పెరిగాయని ఆరోపిస్తున్నది. తరగతి గదులు 30 ఏండ్ల వరకు పటిష్టంగా ఉండేలా కడితే.. వాటికి అయిన ఖర్చు మాత్రం 75 ఏండ్ల జీవితకాలం కలిగిన పక్కా తరగతి గదుల వ్యయానికి సమానంగా ఉందని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కన్సల్టెంట్లను, ఆర్కిటెక్ట్‌‌లను నియమించడంలో సరైన ప్రాసెస్ పాటించకపోవడం వల్ల వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగినట్లు ఏసీబీ తెలిపింది. ఈ గదులను సెమీ- పర్మనెంట్ స్ట్రక్చర్ (ఎస్‌‌పీఎస్) రూపంలో నిర్మించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. 

ఎస్‌‌పీఎస్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 2,292కి చేరగా..పక్కా పాఠశాల భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 2,044 నుంచి రూ. 2,416 మధ్య ఉంది. కొత్త టెండర్లను పిలవకుండానే ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 326 కోట్లు పెరిగినట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక వెల్లడించింది. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో  దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు అవినీతి జరిగిన సమయంలో బాధ్యతగల పదవుల్లో ఉన్న సిసోడియా, సత్యేంద్ర జైన్‌‌ను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదుచేశారు.