- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా ఓటింగ్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మూడో దశ ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. వలస ఓటర్లను వాహనాల్లో తరలించడం, స్వచ్ఛందంగా ఓటర్ల రాకతో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదయింది. కరీంనగర్ జిల్లాలో 86.42 శాతం , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79.44 శాతం, పెద్దపల్లి జిల్లాలో 85.66, జగిత్యాల జిల్లాలో 79.64 శాతం పోలింగ్ నమోదైంది.
మూడో దశ ఎన్నికలు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లోని 111 గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. మూడు చోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగతా 108 సర్పంచ్ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి.
1,034 వార్డుల్లో 184 మంది ఏకగ్రీవం కాగా మిగతా 850 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,65,046 మంది ఓటర్లకుగానూ 1,42,637 మంది(86.42శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీణవంకలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యుప్ టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మూడో విడతలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల పరిధిలో 91 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే ఆరు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 85 స్థానాలకు ఎన్నికలు జరగగా 82.34 శాతం నమోదైంది. ఈ నాలుగు మండలాల పరిధిలో మొత్తం 1,42,548 ఓటర్లు ఉండగా, 1,22,111ఓట్లు పోలయ్యాయి. వీరిలో మహిళలు 72,655 ఓట్లకు గానూ 62,823, పురుషులు 69,891 మందికి గానూ 60,287 మంది ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్మొదటి గంట మందకొడిగా సాగగా.. ఆ తర్వాత పుంజుకుంది. గతం కంటే 2 శాతం పెరుగుతూ 85.66 శాతంగా నమోదైంది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన సొంత గ్రామం శివపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జగిత్యాలలో 79.64 శాతం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికలు ముగిశాయి. జిల్లాలో మొత్తం 119 గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 6 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 113 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరిగింది. జిల్లాలోని ఆరు మండలాల్లో గ్రామపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడత ఎన్నికల పోలింగ్ 79.64 శాతంగా నమోదైంది.
