నేను కూడా రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే

 నేను కూడా రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిదన్నారు మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్ లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల కృతజ్ఞత సభకు హాజరైన ఆయన..రిటైర్డ్ ఉద్యోగులు కోరితే వచ్చానన్నారు. నేను కూడా రిటైర్ట్ ఉద్యోగి బిడ్డనేనన్న హరీశ్.. తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే శవయాత్ర అనే నినాదమిచ్చి పట్టుదలతో ఆమరణ దీక్షకు బయలుదేరిన నేత కేసీఆర్ అని అన్నారు. 14-15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ వస్తే అంతా చీకటేనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే.. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చేలా రాష్ట్రం ఎదిగిందన్నారు. అంతేకాదు.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగి.. పక్క రాష్ట్రాలకు కూడా కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. కరెంట్ కోతల నుంచి..అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చేలా ఎదిగామన్నారు.

 
కాళేశ్వరం ప్రాజెక్టు బతికుండగా చూస్తామా అని అన్నారని.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సేకరిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారన్నారు. కానీ కాళేశ్వరం మొదటి  ఫలితం హుజురాబాద్ కే దక్కిందన్నారు. గత ఎండకాలం ఎన్ని పంటలు పండాయో చూశారన్నారు. నీళ్లు వద్దని రైతులు కోరేంత వరకు నీళ్లు ఇచ్చుకున్నామని తెలిపారు. దేశంలో అధిక ధాన్యం పండించే పంజాబ్ ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 
70 ఏళ్లలో సాధ్యంకాని పనులెన్నో పూర్తి చేసుకున్నామన్న హరీశ్ రావు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై దృష్టి పెట్టారని తెలిపారు. ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కాపాడుతుంటే.. కేంద్రం రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకశ్రయాలు అమ్ముతోందని విమర్శించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


గతంలో పీఆర్సీ ఆలస్యమైతే ఎరియర్స్ ఇచ్చేవాళ్లు కాదు.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు ఎరియర్స్ ఇచ్చారని తెలిపారు. లక్ష కోట్ల ఆదాయం కరోనా కారణంగా తగ్గిపోయిందన్నారు. మరోవైపు లాక్ డౌన్ వల్ల ప్రజలు నష్టపోయారని తెలిపారు హరీశ్. 


వైద్యం పైనే దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసామని తెలిపారు. ఎంత ఆదాయం తగ్గినా.. అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగించారన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందో ఆలోచించండన్న హరీశ్..చల్లకొచ్చి ముంతదాచుడెందకని  గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని విజ్ఞప్తి  చేస్తున్నానని అన్నారు. రైతు బంధు రూపంలో కుడిచేత కేసీఆర్ ఎకరాకు ఐదువేలిస్తుంటే.. ఎడమ చేతితో డీజిల్ ధరలు పెంచి కేంద్రం లాక్కుంటోందిని ఆరోపించారు. 


బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేసారా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు మేలు కావాలని ఏమన్నా రాజీనామా చేసాడా? ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుంది.. హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందన్నారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ప్రస్టేషన్ తో నాపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు


నేనేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు హరీశ్. ఎన్నిసార్లు అరెస్టయ్యానో, ఎంత నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడానో అందరికీ తెలుసు.. పేద ప్రజలకు అందుబాటులో ఉండి  ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ మాట తప్పని వ్యక్తిని నేను అని చెప్పుకొచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. ప్రతిసారి అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నా అని అన్నారు. 4 వేల ఇళ్లు మంజూరు చేస్తే.. ఈటల  ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ఆయనతో పాటు ఇళ్లు మంజూరు చేయించుకున్న మంత్రులంతా గృహప్రవేశాలు చేయించారన్నారు.