
- జూపల్లి కృష్ణారావు
- వర్షాలు, వరదలపై సమీక్ష
- మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలులు
ఆదిలాబాద్/బోథ్/నిర్మల్/నేరడిగొండ, వెలుగు: వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను నష్టపోనివ్వమని ఉమ్మడి ఆదిలాబాద్ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంత్రి గురువారం ఆదిలాబాద్జిల్లాలో పర్యటించారు. సాయంత్రం కలెక్టరేట్లో ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర శాఖల అధికారులతో వర్షాలు, వరదలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో భారీ వర్షాలకు వరద నష్టం వివరాలను మంత్రికి కలెక్టర్ వివరించారు.
12,775 మంది రైతులకు 17,496 ఎకరాలకు పంట నష్టం జరిగిందన్నారు. ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఐటీడీఏ, మున్సిపల్, ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్ శాఖలకు సంబంధించిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద నష్టంపై అధికారులు నివేదిక అందజేయాలని, ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని వెల్లడించారు. రైతులెవరినీ అన్యాయం జరగకుండా చూసుకుంటామన్నారు. వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు.
ఉన్నది ఒకటే జీవితం.. లక్ష్యం కోసం ప్రయత్నించు
బోథ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జూపల్లి బాలికల గిరిజన సంక్షేమ స్కూల్ సందర్శించారు. కాలేజీ డార్మెటరీ బిల్డింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. చిన్నచిన్న విషయాలకే కుంగిపోవద్దన్నారు. సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవాలన్నారు. చిన్నపాటి సమస్యలకు నిరుత్సాహపడకుండా ప్రతిక్షణం లక్ష్యం వైపు సాగిపోతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం మైకులో ‘ఒకటే జననం ఒకటే మరణం’ వంటి పాటలను వినిపించి మనిషి ప్రాణాల విలువను తెలియజేశారు.
మంత్రికి ఘన స్వాగతం
అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లికి నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆడే గజేందర్ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజేందర్ ఆధ్వర్యంలో మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్ బీఆర్ఎస్ ను వీడి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చూసి నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.
ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, బోథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆడె వసంతరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫీజు బకాయిలను విడుదల చేయాలి
ప్రవేట్ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు నాలుగేండ్లుగా రావాల్సిన ఆర్టీఎఫ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిగ్రీ కాలేజీల యజమాన్య సంఘ సభ్యులు మంత్రిని కోరారు. నిర్మల్ పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లికి వినతిపత్రం అందజేశారు. తమ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా కేవలం ప్రభుత్వం అందించే ఆర్టీఎఫ్ ద్వారానే నడిపిస్తున్నామని తెలిపారు.
గత నాలుగేండ్లుగా స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. ఫీజు బకాయిలను చెల్లించి ఆదుకోవాలని కోరారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యజమాన్య సంఘ సభ్యులు సాయిలు, వెంకట్ రెడ్డి, ప్రమోద్ రావు, అఖిలేశ్ సింగ్, సతీశ్ రెడ్డి, శ్రీధర్, నర్సారెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
మంత్రి జూపల్లి, నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జ్ ఆడె గజేందర్ సమక్షంలో బోథ్మండల కేంద్రంలో పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలకు చెందిన 124 మంది యువకులు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, కాంగ్రెస్విచార్ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్, నాయకులు చంటి, అచ్యుతానంద్ రెడ్డి, అబ్రార్, రహీమొద్దిన్, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.