
- నల్గొండలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
- పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులను తీర్చిదిద్ది దేశాన్ని నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందన్నారు. గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చాటి చెప్పారన్నారు. మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు.
నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ తరహాలో సొంత నిధులతో నిర్మించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ సంవత్సరం 12 శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం , ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎఎస్పీ రమేశ్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.