మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో రాజీపడొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల వసతి, సదుపాయాలపై సోమవారం స్థానిక ప్రెసిడెన్షియల్ సూట్‌లో కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావుతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఈవో వెంకటరావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ బిల్లులు ఉంటే నివేదిక సమర్పించాలని, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి బిల్లులు క్లియర్ అయ్యేలా చూస్తానని చెప్పారు.
కొండపైన భక్తులు నిద్ర చేసేందుకు వీలుగా డార్మెటరీ హాళ్లు నిర్మించాలని సూచించారు. దాతల సహకారంతో చేపట్టే కాటేజీలు, సోలార్ విద్యుత్ పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, భక్తులకు అన్ని రకాల సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేయాలని చెప్పారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డికి కలెక్టర్ హనుమంతరావు స్వాగతం పలికారు.
అనంతరం అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి, వేదాశీర్వచనం చేశారు. ఈవో వెంకటరావు స్వామివారి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు, యాదగిరిగుట్ట ప్రధానాలయ నమూనాను బహూకరించారు. కార్యక్రమంలో స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, తహసీల్దార్ గణేశ్‌నాయక్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, డీసీసీ మాజీ చీఫ్ అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు.
