
- అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. ఇప్పటివరకు పరిహారాలు విడుదల చేయకపోతే వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించారు.
ఏ ఒక్క బాధితుడు కూడా పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇప్పటివరకు తీసుకున్న సహాయక చర్యలపై బుధవారం సెక్రటేరియెట్‌లోని తన ఆఫీసులో మంత్రి సమీక్షించారు. సీఎస్ రామకృష్ణారావు, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సుల్తానియా పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, రోడ్ల రిపేర్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు. కాగా, వరద సహాయానికి సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలను కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 13లోగా ఆయా విభాగాలు యూసీలను సమర్పించాలని ఆదేశించారు.
జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష
నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్‌వో జి. మల్సూర్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్‌ల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.