
- నేడు మంత్రి పొంగులేటి చేతులమీదుగా డబుల్ ఇండ్ల ఓపెనింగ్
- లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్న మంత్రి
- ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని గుడిసె వాసుల కల సాకారమయ్యే రోజు వచ్చింది. హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ గుడిసె వాసులు ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తుండగా.. శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి ముస్తాబు చేశారు. దీంతో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న గుడిసె వాసుల సొంతింటి కల నెరవేరబోతోంది.
40 ఏండ్లుగా గుడిసెల్లోనే..
హనుమకొండ బాలసముద్రంలోని అంబేడ్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ లో దాదాపు 40 ఏండ్ల కిందట దాదాపు 160కి పైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉండేవి. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్.. వరంగల్ పర్యటనలో భాగంగా స్లమ్ ఏరియాల్లో పర్యటించి, అంబేడ్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ గుడిసెవాసులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారిని గుడిసెలను ఖాళీ చేయించి, అదే స్థలంలో 37 బ్లాకుల్లో 16 చొప్పున 592 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు.
వాటి పనులు 2018లోనే పూర్తయినా అప్పటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాటిని పంచకుండా నిర్లక్ష్యం చేశారు. గుడిసెవాసులు వందలసార్లు ఆందోళనలు చేపట్టి, లీడర్లు, ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఈ రెండు కాలనీల గుడిసెవాసులు నాలుగు దశాబ్ధాలుగా గుడిసెల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డబుల్ ఇండ్ల పంపిణీపై కసరత్తు చేశారు. ఎట్టకేలకు డబుల్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు.
నేడే లబ్ధిదారులకు పంపిణీ
ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ మినిస్టర్స్ రెసిడెన్స్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న మంత్రి పొంగులేటి 10.15 గంటలకు అంబేడ్కర్ నగర్ కు చేరుకుంటారు. అక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం చేసి, అనంతరం కాళోజీ కళా క్షేత్రంలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తారు. అనంతరం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
దీంతో ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ప్రారంభించనున్న డబుల్ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి పరిశీలించారు. బ్లాక్ ల వారీగా డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, శానిటేషన్ సమస్యలను వెంటనే సాల్వ్ చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వారి వెంట కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, హనుమకొండ ఎమ్మార్వో రవీందర్ రెడ్డి ఉన్నారు.