వరద ముప్పు, ట్రాఫిక్ కష్టాల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నం

వరద ముప్పు, ట్రాఫిక్ కష్టాల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నం
  • సిటీ ఇన్​చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్
  • భారీ వానల వేళ అన్ని శాఖల అధికారులతో సమీక్ష 
  • ఈసారి ఊహించిన దానికన్నా ఎక్కువ వానలు
  • 24 గంటలు అందుబాటులో ఉన్నం.. ప్రజలూ సహకరించాలి
  • వర్షం తగ్గిన వెంటనే బయటకు రావొద్దని విజ్ఞప్తి 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం సంకల్పంతో ఉందని, సీఎం రేవంత్​రెడ్డి ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సిటీ ఇన్​చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ముందుచూపుతో నగరంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. స్వల్ప సమయంలో అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వరద ఓవర్​ఫ్లో, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. 

ఆదివారం జీహెచ్‌‌ఎంసీ హెడ్డాఫీస్​లో మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్‌‌‌‌ఎంసీ, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్, ఇరిగేషన్ విభాగాల అధికారులతో వర్షాకాల జాగ్రత్తలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై చర్చించారు. మాన్సూన్ సంబంధిత పనులు, రోడ్డు రిపేర్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ వర్క్స్, డీ- సిల్టింగ్, క్యాచ్ పిట్‌‌ల నిర్మాణం, హైడ్రా సమన్వయంతో చేపట్టిన చర్యలను మంత్రికి బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ సందర్భంగా వివరించారు. సివరేజ్ స్టార్మ్ వాటర్ ఓవర్‌‌ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 

ప్రజా రవాణాను వాడాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. సమీక్ష అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.  భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ప్రజా రవాణాను వాడటం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించవచ్చన్నారు. వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రాకుండా కొంత సమయం తీసుకొని రోడ్లమీదకు వస్తే మంచిదన్నారు. ఈసారి ఊహించిన దానికన్నా ఎక్కువ వర్షం పడుతోందని, ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నామన్నారు.

 24 గంటలు  అందుబాటులో ఉన్నామని,  సెలవులను, వ్యక్తిగత పనులను సైతం పక్కన పెట్టి మరీ వానాకాలం సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యామన్నారు. ఇప్పుడు వరదలు వస్తున్నప్పటికీ ఎండా కాలంలో  ఎక్కడాలేని నీటి సమస్య వస్తుందన్నారు. అందుకు ఈ వర్షాకాలంలో నీటిని సంరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.