బతుకమ్మ నాటికి రోడ్డు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

 బతుకమ్మ నాటికి రోడ్డు పూర్తి చేయాలి :  మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క 

ములుగు/ వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: వచ్చే బతుకమ్మ పండుగ వరకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మంత్రి ములుగు జిల్లాలో పర్యటించారు. తొలుత ములుగు జిల్లా ప్రభుత్వాస్పత్రి వద్ద జాతీయ రహదారి నుంచి తోగుంట వరకు రూ.4 కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్​ ఏర్పాటు చేసి మహిళలు బతుకమ్మలతో వెళ్లేందుకు ముస్తాబు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని వివరించారు.

 తాడ్వాయి మండలం మేడారం వెళ్లిన మంత్రి భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం ములుగు కలెక్టరేట్ లో వీహబ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. వీ హబ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రామ్ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకొని మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం మహిళా శక్తి పథకం ద్వారా మత్స్య శాఖ ఆర్థిక సాయంతో రెండు మొబైల్ ఫిష్ ఔట్లెట్ లను మత్స్యకార మహిళలకు పంపిణీ చేశారు. 

గోవిందరావుపేట మండలంలో భారీ వర్షాలతో నష్టపోయిన 495 కుటుంబాలకు యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ప్రాజెక్టు నగర్​ లో 149 కుటుంబాలకు మంత్రి సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపూర్​ మండలం సింగారకుంటపల్లెలో కొత్త జీపీ భవనం, నర్సాపూర్​లో సీసీ రోడ్లు, నారాయణగిరిపల్లిలో అంగన్​వాడీ భవవనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్​ దివాకర, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రవిచందర్​ తదితరులు పాల్గొన్నారు.  

నష్టపరిహారం ఇవ్వండి

తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల మహా జాతర సందర్భంగా రెండో పంట నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని మంగళవారం మేడారం ఐటీడీఏ క్యాంపు ఆఫీస్​లో  రైతు సహకార సొసైటీ చైర్మన్ సంపత్ గౌడ్, కాంగ్రెస్ మండల గౌరవ అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చరప రవీందర్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి పంట నష్టపోతున్న రైతుల భూములను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్​కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతుల తరఫున మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.